boianpalli vinod kumar | బీఆర్ఎస్లో గెలిచి వేరే పార్టీలో చేరుతున్న వాళ్లను చూసి బాధపడాల్సిన పనిలేదని మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్‌కుమార్ అన్నారు. వాళ్లు అప్పుడు అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరుతున్నామని చెప్పారని.. ఇప్పుడు కూడా అదే చెప్పి పార్టీ మారుతున్నారని విమర్శించారు. పార్టీలు మారే ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. వాళ్లు తిరిగి వస్తామంటే ప్రజలు రానివ్వరని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బోయిన్పల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. త్వరలోనే పార్టీ సమావేశాలు పెట్టుకుందామని.. కొత్తతరం నేతలను కేసీఆర్ ప్రోత్సహిస్తారని చెప్పారు.
బీజేపీకి కేంద్రంలో సొంతంగా మెజారిటీ రాలేదని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ అన్నారు. టీడీపీ, జేడీయూ తదితర పార్టీల మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిందని తెలిపారు. ఏపీ విభజన చట్టంలో ఉన్న అంశాలపై ఇటీవల చంద్రబాబు ఢిల్లీ వెళ్లినప్పుడు ప్రధాని మోదీతో మాట్లాడారని చెప్పారు. ఆ తర్వాత విభజన చట్టం షెడ్యూల్ 13లో ఉన్న పెట్రో, కెమికల్, ఆయిల్ రిఫైనరీ హబ్ ఏపీకి ఇస్తున్నట్లుగా ప్రముఖ పత్రికలో వార్తలు వచ్చాయని అన్నారు. ఇదే షెడ్యూల్ 13లో తెలంగాణకు కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని ఉందని తెలిపారు. పదేళ్లుగా అడుగుతున్నా తెలంగాణకు ఏమీ ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.
ఏపీలో పెట్రో కెమికల్స్ రిఫైనరీ ఏర్పాటుకు తాము వ్యతిరేకం కాదని.. మాకు రావాల్సినవి కేంద్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నామని బోయిన్పల్లి వినోద్‌కుమార్ తెలిపారు. చంద్రబాబుపై కేంద్రం ఆధారపడింది కాబట్టే ఏపీకి పెట్రో, కెమికల్ హబ్ ఇస్తున్నారని.. ఇక్కడ తెలంగాణపై ఆధారపడలేదు కాబట్టే ఏమీ ఇవ్వడం లేదా అని ప్రశ్నించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. అదే మోదీకి ఏపీలో సొంతంగా సీట్లు వచ్చి ఉంటే అక్కడ కూడా ఏమీ ఇచ్చేవాళ్లు కాదని విమర్శించారు. ఏపీలో ప్రాంతీయ పార్టీ గెలిచింది కాబట్టే చంద్రబాబు అడిగినవన్నీ ఇస్తున్నారని అన్నారు. 8 మంది ఎంపీలను గెలిపించినా బీజేపీ తెలంగాణ ప్రజలకు మొండి చేయి చూపిస్తోందని విమర్శించారు.
తెలంగాణకు కేంద్రం ఐటీఐఆర్ ఇవ్వలేదని.. కేసీఆర్ కొత్తగా జిల్లాలు ఏర్పాటుచేస్తే ఒక్క నవోదయ విద్యాలయం కూడా ఇవ్వలేదని బోయిన్పల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాజకీయాల గురించి తప్ప రాష్ట్ర అభివృద్ధిపై ఒక్క చర్చ లేదని అన్నారు. ఏపీకి ఆయిల్ రిఫైనరీ ఇచ్చినట్లుగానే.. తెలంగాణకు విభజన చట్టంలో పేర్కొన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బోయిన్పల్లి వినోద్ కుమార్ తెలిపారు. కొన్నిసార్లు కొన్ని కారణాలతో ఓడిపోతుండవచ్చని ఆయన అన్నారు. వచ్చే ఐదేళ్ల తర్వాత బీఆర్ఎస్ బ్రహ్మాండమైన మెజార్టీతో మళ్లీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.