చిక్కడపల్లి, మే 3 : ఇంటర్మీడియట్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని తెచ్చేందుకు మాతృభాషను తొలగిస్తరా? అని పలువురు వక్తలు ప్రశ్నించారు. సంస్కృతం సబ్జెక్టును ద్వితీయ భాషగా తీసుకొచ్చేందుకు జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు భాషాభిమానుల ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో ‘తెలుగు రాష్ట్రంలో తెలుగుభాషకు అవమానం ఎందుకు? రెండో భాషగా తెలుగును తొలగిస్తరా?’ అనే అంశంపై సమాలోచన సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ సుదర్శన్‌రెడ్డి, ప్రొఫెసర్ జీ హరగోపాల్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, మోతుకూరు నరహరి, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, శ్రీరంగాచార్య తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలుగుభాష ద్రావిడ భాష నుంచి విడివడి స్వతంత్రంగా ఎదుగుతున్నప్పటి నుంచి అనేక ఆటుపోట్లను తట్టుకుంటూ నిలదొక్కుకున్నదని గుర్తుచేశారు. తన మౌలిక లక్షణాలను కాపాడుకుంటూ వస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణలోని పాత ఓరియంటల్(తెలుగు) కళాశాలను ప్రభుత్వ రంగంలో సకల సౌకర్యాలతో పునరుద్ధరించాలని కోరారు. మాతృభాష తెలుగుకు ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో తెలుగును తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చి అమలుచేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో డా. డీ చంద్రశేఖర్‌రెడ్డి ప్రొఫెసర్ పిల్లలమర్రి రాములు, కవి యాకూబ్, ప్రొఫెసర్ సాగి కమలాకరశర్మ, డా. సిల్మానాయక్, వెల్దండి శ్రీధర్, రాఘవాచారి, వామన్‌కుమార్, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.