హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు కేవలం ఐదు రోజులు మాత్రమే నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ నెల 13 నుంచి కామన్వెల్త్ పార్లమెంటేరియన్స్ సమావేశాలు జరుగనుండటం, వీటికి మండలి చైర్మన్, స్పీకర్ హాజరుకావాల్సి ఉండటం వల్ల సమావేశాలను 11వ తేదీ మధ్యాహ్నానికే ముగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది. అయితే, సమావేశాలు ఎన్ని రోజులపాటు కొనసాగుతాయన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశంలో తీసుకొనే నిర్ణయాన్ని బట్టి అసెంబ్లీ, మండలి సమావేశాల వ్యవధి ఖరారు కానున్నది.
ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ నెల 7వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే, కేప్‌టౌన్‌లో జరుగనున్న కామన్వెల్త్ పార్లమెంటేరియన్స్ సమావేశాలకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ హాజరు కావాల్సి ఉన్నది. ఆ సమావేశాలు 13 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరిద్దరు అంతకుముందే కేప్‌టౌన్ వెళ్లాల్సి ఉంటుంది. దీంతో అసెంబ్లీ, మండలి సమావేశాలను 11వ తేదీ మధ్యాహ్నానికే ముగించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నది.
అయితే సమావేశాలను 11వ తేదీతోనే ముగించాలా? లేక ఆ తర్వాత కూడా కొనసాగించాలా? అన్నది మాత్రం బీఏసీ సమావేశంలో నిర్ణయించనున్నారు. ఈ సమావేశాల్లో రెండు, మూడు కీలక బిల్లులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. దీంతో ఆయా బిల్లులపై చర్చకు ఎంత సమయం అవసరమవుతుందన్నది కూడా సమావేశాల నిర్వహణలో కీలకంగా మారనున్నది. బీఏసీ భేటీ తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.