Supari | నర్సంపేట, మార్చి13 : ఏకంగా కట్టుకున్న భర్తనే కడతేర్చాలని చూసింది ఓ భార్య. 10లక్షలు ఇస్తా…నా భర్తను చంపేయండి… అంటూ ఓ ముఠాకు ఆఫర్ ఇవ్వగా ముఠా సభ్యుడి అత్యాశతో సీన్ రివర్స్ అయిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ఆకులతండాలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన ధరావత్ సుమన్‌కు ఇదే మండలం మహేశ్వరం తండాకు చెందిన భూక్యా మంజులతో 2018లో వివాహం జరిగింది.
వీరి ఒక పాప ఉన్నది. సుమన్ హైదరాబాద్‌లోని ఓ ప్రభుత్వ రంగ సంస్థలో బ్యాంకు పీవోగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 3 సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. దీంతో మంజుల ఎలాగైనా భర్తను వదిలించుకోవాలని చూసింది. మంజుల బావ, సమీప బంధువు నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామానికి చెందిన మోతీలాల్ సహాయంతో ముఠా సభ్యులను కలిసి సుపారీకి ఆఫర్ చేసింది.
ముఠా సభ్యులైన రాయపర్తి మండలానికి బానోత్ నరేశ్, తొర్రూరు మండలానికి చెందిన మల్లేశ్, నర్సంపేట మండలం ఆకులతండాకు చెందిన గోపితో రూ.10లక్షల డీల్ మాట్లాడుకున్నది. ఈ ముఠా సభ్యులు హోలీ తర్వాత సుమన్‌ను హత్య చేసేందుకు ప్లాన్ చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం సుమన్‌కు రాయపర్తి మండలానికి చెందిన నరేశ్ ఫోన్ చేసి రూ.3 లక్షలు ఇస్తే విలువైన సమాచారం ఇస్తానని చెప్పాడు.
ఈ ఈ మేరకు బాధితుడు రెండు రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నరేశ్ ఫోన్‌ను ట్రాప్ చేయడంతో అసలు విషయం బయటపడింది. ఒక్కొక్క ముఠా సభ్యుడికి రూ.30వేల చొప్పున ముగ్గురికి అడ్వాన్స్ పేమెంట్ కూడా ముట్టజెప్పినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ డీల్‌లో ఆకులతండాకు చెందిన గోపి ప్రధాన భూమికను పోషించాడు. మంజుల, మోతీలాల్, ముఠా సభ్యులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఎస్సై అరుణ్‌కుమార్ తెలిపారు.