బరేలీ, ఏప్రిల్ 19: నలుగురు పిల్లల తల్లి తన ప్రియుడితో కలసి జీవించడానికి భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి ప్రయత్నించి జైలు పాలైంది. ఉత్తర్ ప్రదేశ్లో మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఆదివారం రాత్రి (ఏప్రిల్ 13) రేఖ(25) తన భర్త కేహార్ సింగ్కు టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తన ప్రియుడు పింటూను పిలిపించింది.
వారిద్దరూ కలిసి కేహార్ సింగ్ను గొంతు నులిమి చంపి దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించడానికి మృతదేహాన్ని తాడుతో ఉరివేశారు. మరుసటి రోజు ఉదయం రేఖ రోదనలతో ఇరుగుపొరుగు వారు మేల్కొన్నారు. మృతదేహాన్ని కిందకు దించి పోలీసులకు సమాచారం అందించారు. ఇంతవరకు రేఖ అనుకున్నట్టే జరిగింది.
కాని పోస్టుమార్టం నివేదికలో అసలు విషయం వెల్లడైంది. రేఖకు ఉన్న వివాహేతర సంబంధంపై భార్యాభర్తల మధ్య ఏడాదిగా నిత్యం గొడవలు జరుగుతున్నట్లు పోలీసులు చెప్పారు. విడాకులు ఇవ్వాలని రేఖ భర్తను ఒత్తిడి చేసిందని వారు తెలిపారు. తన సోదరుడిని హత్య చేసినందుకు రేఖ, పింటూపై కేసు పెట్టినట్లు మృతుడి సోదరుడు అశోక్ సింగ్ చెప్పారు.