నస్రుల్లాబాద్, జనవరి 24: ప్రియుడిపై మోజు పెంచుకున్న ఓ ఇల్లాలు భర్తను చంపిన ఘటన కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం నెమ్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై లావణ్య, స్థానికుల కథనం ప్రకారం.. నెమ్లికి చెందిన మైసయ్య (39)కు భార్య రాధ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాన్సువాడలోని బ్యాండ్‌మేళం యజమాని నాగరాజు వద్ద మైసయ్య పనిచేసేవాడు. నాగరాజుకు మైసయ్య భార్యతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలిసి మైసయ్య భార్యను మందలించాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుని ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది.
అనారోగ్యంతో బాధ పడుతున్న భర్తను దవాఖానకు తీసుకెళ్తున్నానని డిసెంబర్ 15న ఇంటి నుంచి వెళ్లింది. వారం తర్వాత ఒంటరిగా ఇంటికి చేరుకుంది. మైసయ్య ఎక్కడ అని తల్లిదండ్రులు రాధను ప్రశ్నించగా, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు వెళ్లాడని బదులిచ్చింది. ఆ తర్వాత ఇంటి నుంచి వెళ్లిపోయిన రాధ మైసయ్య తల్లిదండ్రులకు బాన్సువాడలో కనిపించింది. అనుమానం వచ్చిన తల్లిదండ్రులు ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రాధ, నాగరాజును అదుపులోకి తీసుకుని విచారించగా మైసయ్య హత్య వెలుగులోకి వచ్చింది. మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి దుర్కి శివారులోని సోమలింగేశ్వర ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పడేసినట్టు నిందితులు పేర్కొన్నారు. పోలీసులు కోనేరు వద్దకు వెళ్లగా కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యమైంది. అక్కడే పోస్టుమార్టం చేయించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.