యాదగిరిగుట్ట, జూలై 15: ప్రియుడికి దగ్గరయ్యేందుకు ఓ భార్య కట్టుకున్న భర్తనే కడతేర్చింది. ప్రియుడు, తమ్ముడు, మరో వ్యక్తితో కలిసి కారుతో తన భర్త బైక్‌ను ఢీకొట్టించి.. ఆపై ప్రమాదంగా చిత్రీకరించింది. యాదగిరిగుట్ట పోలీసులు ఈ కేసును 24 గంటల్లోనే ఛేదించారు. భువనగిరి జోన్ డీసీపీ అకాంక్ష్ యాదవ్ మంగళవారం వెల్లడించిన వివరాలు ఇలా.. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం పల్లెపహాడ్‌కు చెందిన గుంటి సాయికుమార్ గతంలో భువనగిరిలోని మార్బుల్ దుకాణంలో పనిచేశాడు. పస్తుపుల స్వామి భార్య స్వాతి కూడా అతడి సమీపంలోనే ఎస్ఎన్ మోటార్స్‌లో పనిచేసేది. ఆ సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఎస్ఎన్ మోటార్స్ మూతపడటంతో స్వాతి తన గ్రామానికి వెళ్లిపోయింది. ఆ తరువాత భర్త స్వామి మేనేజర్‌గా పనిచేస్తున్న ఓ ట్రాక్టర్ షోరూంలో పనిచేస్తుంది.
వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. స్వగ్రామమైన పల్లెపహాడ్ నుంచి రోజూ కారులో మోత్కురుకు ఉద్యోగానికి వెళ్లేవారు. కాగా 2024 ఫిబ్రవరి నెలలో సాయికుమార్ మోత్కూర్‌కు వెళ్లగా స్వాతి కనిపించింది. దీంతో వీరిద్దరు ఫోన్ నంబర్లు ఇచ్చి పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వాట్సాప్‌లో మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా స్వామి తన సమీప బంధువు, వరుసకు సోదరి అయిన మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ విషయం సదరు మహిళ భర్త మహేశ్‌కు తెలియడంతో అతడు స్వామిపై కక్ష పెంచుకున్నాడు. ఈ విషయమై స్వాతి తన భర్తను హెచ్చరించింది. అప్పటి నుంచి స్వామి, స్వాతికి మధ్య విబేధాలు పెరిగిపోయాయి.
ఈ క్రమంలో ఆదివారం ఉదయం స్వామి, తన మిత్రుడైన మద్దికుంట వీరబాబుతో కలిసి వలిగొండకు వెళ్లి అక్కడి నుంచి భువనగిరికి తన బైక్‌పై వెళ్లారు. ఇదే అదునుగా భావించిన స్వాతి తన ప్రియుడు సాయికుమార్, తమ్ముడు మహేశ్, భువనగిరిలోని తాతానగర్‌కు చెందిన చీమల రామలింగస్వామితో కలిసి హత్యకు కుట్ర పన్నింది. భువనగిరిలో కారును సెల్ఫ్ డ్రైవ్ కోసం తీసుకున్నారు. భువనగిరి నుంచి బైక్‌పై మోత్కూర్ రోడ్డు మీదుగా గ్రామానికి వెళ్తున్న స్వామిని మోటకొండూర్ మండలం కాటేపల్లి శివారుకు రాగానే సాయికుమార్ కారుతో ఢీకొట్టాడు. స్వామి పక్కనే గల చెట్టును ఢీ కొట్టడంతో తలకు తీవ్రంగా గాయమై అక్కడికక్కడే మృతిచెందగా, ఆయనతోపాటు బైక్‌పై ఉన్న వీరబాబుకు బలమైన గాయాలయ్యాయి. ఈ కేసులో నిందితులైన గుంటి సాయికుమార్, స్వాతి, ఆమె తమ్ముడు పొట్టెపాక మహేశ్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు డీసీపీ తెలిపారు. మరో నిందితుడు చీమల రామలింగస్వామి పరారీలో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు.