నాగర్‌కర్నూల్, నవంబర్ 22 : కాళ్లనొప్పులు తగ్గించుకునేందుకు సొంతంగా నాటుమందు తీసుకుంటే ఒకరు మృతి చెందగా.. ఇద్దరు చికిత్స పొందుతున్న ఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. గ్రామస్థుల కథనం మేరకు.. బిజినేపల్లి మండలం ఖానాపూర్‌కు చెందిన నిరంజన్, భార్య చాంద్‌బీ(70) కొన్నేండ్లుగా పలు రకాల వ్యాధులకు నాటు వైద్యం చేస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని దుకాణంలో నాటు వైద్యానికి సంబంధించిన మూలికలు తెచ్చుకొని కాళ్ల నొప్పులు నయం చేసుకునేందుకు సొంతంగా మందు తయారు చేసుకున్నారు. శుక్రవారం భార్యాభర్తలతోపాటు కూతురు షమీనా వారు తయారు చేసిన నాటు మందు తిన్నది. రాత్రి నుంచి చాంద్‌బీ, నిరంజన్, షమీ నా వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. చుట్టుపక్కల వారు గమనించి అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ దవాఖానకు తరలించారు. అక్కడ చాంద్‌బీ మృతి చెందగా మిగిలిన ఇద్దరు చికిత్స పొందుతున్నారు.
బాలికపై లైంగికదాడికి యత్నం !
తిప్పర్తి, నవంబర్ 22: నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలంలో 14 ఏళ్ల బాలికపై ఓ మాజీ ప్రజాప్రతినిధి లైంగికదాడికి యత్నించాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతుండటంతో గ్రామస్థుల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామానికి చెందిన బాలిక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నది. రోజూలాగే స్కూల్‌కు వెళ్లి వచ్చిన బాలిక శుక్రవారం సాయంత్రం ఇంటి ఎదుట కాలనీ పిల్లలతో ఆడుకుంటున్నది. అదే సమయంలో ఓ మాజీ ప్రజాప్రతినిధి బాలికను ఇంట్లోకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించాడు. బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు రావడంతో అక్కడి నుంచి పారిపోయాడు.