రఘునాథపాలెం, జూలై 14: ఇటీవల ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బావోజీతండాకు చెందిన ఒక మహిళ, ఇద్ద రు కూతుళ్లు కారు ప్రమాదంలో చనిపోయిన ఘటనలో విస్తుగొలిపే నిజాలు బయట పడ్డాయి. ఈ కేసును విచారిచిన పోలీసులు.. ‘అది యాక్సిడెంట్ కాదు. ముగ్గురిదీ హత్యే’ అని నిర్ధారించారు. ఆదివారం రఘునాథపాలెం పోలీస్ స్టేషన్లో ఖమ్మం ఏసీపీ రమణమూర్తి మీడియాకు వివరాలు వెల్లడించారు. బావోజీతండాకు చెందిన బోడా ప్రవీణ్ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానలో ఫిజియోథెరపి డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ప్రవీణ్‌కు భార్య కుమారి (26), ఇద్దరు కుమార్తెలు కృతిక (4), క్రుషిక (3) ఉన్నారు. ప్రవీణ్.. అదే దవాఖానలో నర్స్‌గా పనిచేస్తున్న కేరళకు చెందిన సోనీ ప్రాన్సిస్‌తో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడు. భార్యను, పిల్లలను చంపితే సోనీ ప్రాన్సిస్‌తో సంతోషంగా ఉండొచ్చని భావించాడు. మే 28న భార్య, పిల్లల ఆధార్ కార్డులను అప్డేట్ చేయించేందుకు ముగ్గురినీ కారులో ఎక్కించుకొని ఖమ్మం తీసుకొచ్చాడు. తిరిగి వెళ్తుండగా భార్య తనకు ఒంట్లో బాలేదని చెప్పింది. ఇదే అదునుగా భావించిన ప్రవీణ్..
ప్లాన్ ప్రకారం అప్పటికే తెచ్చి కారులో పెట్టుకున్న హైడోస్ మత్తు ఇంజెక్షన్‌ను కుమారికి వేశాడు. దీంతో ఆమె మత్తులోకి వెళ్లింది. వెంటనే ఇద్దరు కుమార్తెలను కారు దింపాడు. ఒకరి తరువాత మరొకరిని ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. ఆ తరువాత పిల్లలను కారు ముందు సీటులో పడుకోబెట్టాడు. ముగ్గురూ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించేందుకు.. హర్యాతండా వద్ద మూలమలుపులో కారుతో చెట్టుకు ఢీకొట్టాడు. ఆ ప్రమాదంలోనే భార్య, కుమార్తెలు చనిపోయినట్టు నమ్మించాడు. మొదట రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలూ లేకపోవడంతో అనుమానించారు. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా తానే ముగ్గురినీ హత్య చేసినట్టు అంగీకరించాడు. ఈ ఘటనలో హంతకుడు ప్రవీణ్‌తోపాటు హత్యకు ప్రేరేపించిన ప్రియురాలు సోనీ ప్రాన్సిస్పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్‌ను రిమాండ్‌కు తరలించినట్టు ఏసీపీ తెలిపారు.