వేంసూరు/రామాయంపేట/మాచారెడ్డి/బోయినపల్లి రూరల్, సెప్టెంబర్ 1 : యూరియా కోసం రైతులు రోడ్డెక్కుతున్నారు. యాప్‌లో బుక్ కాకపోవడం, సమయానికి బస్తాలు దొరక్క పోవడంతో ఆగ్రహించిన రైతులు ఆందోళనకు దిగుతున్నారు. యాప్ విధానం రద్దు చేసి, సొసైటీ పరిధిలోని రైతులందరికీ యూరియా సక్రమంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఖమ్మం జిల్లా వేంసూరు మండలం భరణిపాడులో రైతులు సొసైటీ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సొసైటీ పరిధిలోని రైతులకు యూరియా అందించకుండా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు.
ప్రభుత్వం యాప్ విధానం తేవడంతో ఇతర మండలాలు, పొరుగునే ఉన్న ఏపీ రాష్ర్టానికి చెందిన రైతులు కూడా బుక్ చేసుకోవడం వల్ల, సొసైటీ సభ్యులుగా ఉన్న తమకు యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. బ్లాక్ మార్కెట్‌కు యూరియా తరలిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధర్నా అనంతరం సొసైటీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. యూరియా యాప్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని మెదక్-రామాయంపేట రోడ్డుపై బైఠాయించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఎరువులు లభించడం లేదని మండిపడ్డారు. యూరియా ఇచ్చే వరకు రోడ్డుపై నుంచి కదిలేది లేదని భీష్మించారు. ఎస్సై-2 సురేశ్‌కుమార్ వచ్చి సముదాయించినా వినలేదు. ఎరువులు వచ్చేలా తాను ప్రయత్నం చేస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కాగా కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, పాల్వంచ మండలాలోన్లూ రైతులు రోడ్డెక్కారు. మాచారెడ్డి సొసైటీ పరిధిలోని ఏడు విక్రయ కేంద్రాల్లో స్టాక్ అందుబాటులో ఉన్నా బుక్ కావడం లేదని మండిపడ్డారు. యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం సొసైటీ వద్ద రైతులు నిరసనకు దిగారు. సొసైటీకి సోమవారం 900 బస్తాల యూరియా వచ్చిందని, కోరెం, దుండ్రపల్లి, అనంతపల్లి, మలాపూర్ రైతులు మంగళవారం ఉదయం 10:15కు యాప్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించా రు. వారు చెప్పినట్టుగానే యాప్ ఓపెన్ చేశామని, రెండు నిమిషాల్లో 900 బస్తాలు అయిపోయాయని, సొసైటీకి వచ్చి అడిగితే స్టాక్‌లేదని చెప్పారంటూ మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సొసైటీ ముందు నిరసన తెలిపారు.