హైదరాబాద్, నవంబర్ 1(నమస్తే తెలంగాణ): ‘ప్రజా సమస్యలపై కేటీఆర్ పాదయాత్ర చేస్తానంటే బండి సంజయ్ ఎందుకు ఉలిక్కిపడుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో ప్రధాని మోదీతో కాంగ్రెస్ యుద్ధం చేస్తుంటే, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారంటూ శుక్రవారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు. సంజయ్ బాధ చూస్తుంటే ఆర్ఎస్ బ్రదర్స్ (రేవంత్, సంజయ్) అవినాభావ సంబంధం ఇట్టే తెలిసిపోతున్నదని చురకలంటించారు. కేటీఆర్‌తో కలిసి రేవంత్, సంజయ్ పాదయాత్ర చేస్తే ప్రజల స్పందన ఏంటో తెలుస్తుందని హితవుపలికారు. అయినా వారిద్దరూ కలిసి మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు నమ్మబోరని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో ఓటర్ల నమోదుకు ఈ నెల 6తో ముగియనున్న గడువును మరో 2 నెలలు పొడిగించాలని కోరుతూ పౌరసరఫరాల కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్‌సింగ్ శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారికి వినతిపత్రాన్ని అందచేశారు. ఓటర్ల నమోదులో ఎదురవుతున్న సమస్యలను సీఈవో దృష్టికి తీసుకెళ్లారు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో పట్టభద్రులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, ఓటర్ల నమోదు కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలని, ఓటరు నమోదుకు సంబంధించిన అంశాలపై అందరికీ అవగాహన కల్పించాలని కోరారు.