Revanth Reddy | మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత పేల్చిన రాజకీయ బాంబు ముఖ్యమంత్రి శిబిరంలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నది. నేరుగా సీఎంపైనే అవినీతి ఆరోపణలు, రాజకీయ సవాళ్లు విసరడంతో మొదలైన ఈ చిచ్చు.. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల్లో రేవంత్ బలాబలాలు తేల్చే అగ్ని పరీక్షగా మారింది. అయితే ఆ బలనిరూపణలో ముఖ్యమంత్రి అట్టర్‌ఫ్లాప్ అయ్యారు.
కొండా సుస్మిత చేసిన ఆరోపణలను ఎమ్మెల్యేలతో ఎదుర్కోవాలని రేవంత్ శిబిరం చేసిన ప్రయత్నం విఫలమైంది. 40మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని తండ్లాడినా.. 17మంది మాత్రమే మీడియా ముందుకు వచ్చారు. సీఎం సన్నిహితుడు తీవ్ర ఒత్తిడిచేస్తే తప్పనిస్థితిలో మాట్లాడిన మద్దతుదారులు వాళ్లు. అందులోనూ ఐదారుగురు కొండా మీద వ్యతిరేకతతో మాట్లాడినవాళ్లే!
ఆరోపణలు చేసింది సొంత క్యాబినెట్ సహచరి కూతురు! కొద్దిరోజులుగా మంత్రి సైతం సీఎం పర్యటనలకు దూరంగా ఉంటున్నారు. ఈ తరుణంలో ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే, పాలనను విమర్శిస్తే, ఏకంగా సీఎం లక్ష్యంగా శూలాలు విసిరితే..ముఖ్యమంత్రికి మద్దతుగా ఒక్క మంత్రీ మాట్లాడలేదు. విమర్శల్ని ఖండించలేదు. రాష్ట్ర కాంగ్రెస్‌లో రేవంత్ బలం ‘కొండ’ంత రాగమేనని తేలిపోయింది.
హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్‌లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్‌రెడ్డి వర్గం పన్నిన ‘బల ప్రదర్శన’ పాచిక ఘోరంగా బెడిసికొట్టింది. ప్రెస్‌మీట్ ముసుగులో సీఎల్పీ వేదికగా 40 మంది ఎమ్మెల్యేలతో తొడగొట్టి హూంకరిద్దామనుకున్న రేవంత్‌కు సొంత పార్టీ శాసనసభ్యులే గట్టి ఝలక్ ఇచ్చారు. ప్రజాబలంతో కాక సీల్డ్ కవర్‌తో గద్దెనెకిన తోలుబొమ్మవంటూ కర్రు కాల్చి వాతపెట్టారు. తన మిత్రుడి ఉనికిని కాపాడేందుకు సీఎం ఆంతరంగికుడు వేం నరేందర్‌రెడ్డి తెరవెనుక నడిపిన దౌత్యం, ఎత్తుగడలు ఒక్కటీ పని చేయలేదు. 66 మంది సభ్యుల దళంలో రేవంత్‌కు దకిన మద్దతు కేవలం 17 మందిదే కావడం ఆయన నాయకత్వ బలహీనతకు నిదర్శనం. మీడియా ముందుకొచ్చిన వారిలోనూ వలస కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కొండా కుటుంబ ప్రత్యర్థులే అత్యధికం కావటం గమనార్హం. రేపు పొద్దున అధిష్ఠానం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే.. ఆ 17 మందిలో సగం మంది రేవంత్‌ను నట్టేట ముంచి జారుకోవడం ఖాయమని గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
పరకాల సీటు విషయంలో సుస్మితకు, సీఎం రేవంత్‌రెడ్డికి మధ్య విభేదాలు బహిర్గతం కావడంతో ఈ వివాదం మరింత ముదిరింది. రేవూరి ప్రకాశ్‌రెడ్డినే వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి మళ్లీ గెలిపించాలని రేవంత్‌రెడ్డి పిలుపునివ్వడం.. అదే సమయంలో సుస్మిత పరకాల నుంచి పోటీ చేస్తానని ప్రకటించడం.. ఇద్దరి మధ్య రాజకీయ దూరాన్ని స్పష్టం చేసింది. ఆ తర్వాత సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో ప్రకంపనలు సృష్టించాయి. పార్టీ క్రమశిక్షణ కమిటీ సురేఖకు షోకాజ్ నోటీసు ఇవ్వగా, సురేఖ తన కూతురు వ్యాఖ్యలు వ్యక్తిగతమని వివరణ ఇచ్చారు. అక్కడితో సమస్య ముగిసిపోవాల్సింది. కానీ.. అది ముగియలేదు.
కొంత కాలంగా సీఎం, అధిష్ఠానం మధ్య విభేదాలు తలెత్తినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రేవంత్‌రెడ్డి అదను కోసం ఎదురుచూస్తున్నారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ , నామినేటెడ్ పోస్టుల నియామకాల్లో వలస నేతలకే ఎకువ ప్రాధాన్యం ఇస్తున్నారని, పార్టీ జాతీయ నాయకత్వాన్ని పకనపెట్టి సీఎం తన సొంత ఇమేజ్ను పెంచుకోవడానికే మొగ్గుచూపుతున్నారని ఏఐసీసీ దూత నివేదిక ఇచ్చిన నేపథ్యంలో అధిష్ఠానం కోఆర్డినేషన్ కమిటీని రంగంలోకి దించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరిగింది. కో ఆర్డినేషన్ కమిటీ నిర్వహణ, అనంతర పరిణామాలతో అధిష్ఠానం తీరుపై గుర్రుగా ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి, కొండా సురేఖ వ్యవహారాన్ని అస్త్రంగా చేసుకొని, భారీ సంఖ్యలో ఎమ్మెల్యేలను ఒకే వేదికపైకి తెచ్చి అసెంబ్లీలో తనకు తిరుగులేని మద్దతు ఉన్నదని నిరూపించాలని సీఎం వర్గం భావించినట్టు సమాచారం.
గతంలోనూ ఓ ఫాం హౌస్‌లో ఎమ్మెల్యేలకు ఆయనకు వ్యతిరేకంగా భేటీ అయినట్టు వార్తలు రాగా, తాజాగా మరోసారి అలాంటి భేటీయే జరగడం కాంగ్రెస్‌లో చర్చనీయాంశమైంది. ఈ క్రమంలోనూ దాదాపు 40 మంది ఎమ్మెల్యేలతో సీఎం వర్గం బలప్రదర్శనకు వ్యూహం రచించి, ఈ సమీకరణ బాధ్యతను సీఎం అత్యంత సన్నిహితుడు వేం నరేందర్‌రెడ్డికి అప్పగించారని ప్రచారం సాగింది. సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలనే డిమాండ్‌తో ఎమ్మెల్యేలంతా మీడియా ముందుకు రావాలనేది అసలు ప్రణాళిక అని, అయితే, అనుకున్న లెక ఒకటి కాగా.. గ్రౌండ్ రియాలిటీ మరొకటిగా మారిందని సీఎం సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. 40 మంది ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వస్తారని ఆశించినా.. చివరికి ఆ సంఖ్య కేవలం 17 మంది వద్దే ఆగిపోవడం సీఎం శిబిరంలో తీవ్ర చర్చనీయంగా మారింది. మీడియా ముందుకు వచ్చిన వారిలో అత్యధికులు వలస నేతలు, కొండా కుటుంబానికి రాజకీయ వ్యతిరేకులు మాత్రమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
కొండా సురేఖ వ్యవహారం ఒక మంత్రిపై చర్య తీసుకోవాలన్న డిమాండ్ దగ్గర ఆగిపోయేలా కనిపించడం లేదు. అదిప్పుడు రేవంత్‌రెడ్డి నాయకత్వంపై జరుగుతున్న రాజకీయ లిట్మస్ టెస్ట్‌గా మారింది. 40 మంది ఎమ్మెల్యేలతో బలం చూపించాలనుకున్న శిబిరం 17 మందితోనే సరిపెట్టుకోవాల్సి రావడం.. మిగిలిన ఎమ్మెల్యేలు ఎంత ఒత్తిడి తెచ్చినా ముందుకు రాకపోవడం.. కాంగ్రెస్‌లో అసలు కథ మరోచోట నడుస్తున్నదన్న సంకేతాలు ఇస్తున్నాయి. ఇప్పటివరకు తెరవెనుక ఉన్న అసంతృప్తి.. ఇప్పుడు ఒకొకటిగా తెరపైకి వస్తున్నదా? సీఎం శిబిరం వెంట నిలిచే ఎమ్మెల్యేల సంఖ్య క్రమంగా తగ్గుతున్నదా? అనే చర్చ ఊపందుకున్నది. ఈనేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన విదేశీ పర్యటనను అర్ధాంతరంగా కుదించుకొని లండన్ నుంచే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం కావడం అధికార కాంగ్రెస్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ పరిణామాల వెనుక సీఎం పనితీరుపై సొంత పార్టీ ఎమ్మెల్యేల్లో గూడుకట్టుకున్న తీవ్ర ఆగ్రహమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
పార్టీ సీనియర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలను విస్మరిస్తూ కేవలం వలస నేతలకే పెద్దపీట వేస్తున్నారనే అసంతృప్తి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేల్లో తీవ్ర స్థాయిలో రగులుతున్నది. పార్టీ పరంగా కానీ, ప్రభుత్వ పరంగా కానీ ఏవైనా ఇబ్బందులుంటే తనతోనే మాట్లాడాలని సీఎం హెచ్చరించినా పలువురు ఎమ్మెల్యేలు ఆయన నాయకత్వ ధోరణిని బేఖాతరు చేస్తూ బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగకుతున్నారు. అటు అధిష్ఠానం ఆగ్రహం, ఇటు ఎమ్మెల్యేల సహాయ నిరాకరణతో పాటు సొంత పార్టీలోనే నాయకత్వ పట్టు చేజారుతున్నదన్న ఆందోళనల నడుమ సీఎం వెంటనే హైదరాబాద్ చేరుకొని పరిస్థితిని చకదిద్దాల్సిన అనివార్యత ఏర్పడిందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సీఎం రాక రాష్ట్ర కాంగ్రెస్‌లో రాజుకున్న అంతర్గత మంటలను చల్లారుస్తుందా? లేక ఎమ్మెల్యేల తిరుగుబాటు మరింత తీవ్ర రూపం దాల్చుతుందా? అనేది ఉతంఠగా మారింది.
సీఎం అత్యంత సన్నిహితుడైన వేం నరేందర్రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో మొదటి నుంచీ తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకొని ఉన్నది. నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కనీసం లిఫ్ట్ చేయరని, అసలు అపాయింట్మెంట్లు కూడా ఇవ్వరనే విమర్శలు బలంగా ఉన్నాయి. అయితే, తాజాగా మారిన రాజకీయ పరిణామాలతో స్వయంగా వేం నరేందర్‌రెడ్డే ఒక్కో ఎమ్మెల్యేకు ఫోన్ చేసి మాట్లాడాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. సీఎంకు మద్దతుగా, కొండా సురేఖకు వ్యతిరేకంగా సీఎల్పీ కార్యాలయానికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలని ఆయన చేసిన విజ్ఞప్తిపై పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖం మీదే గట్టిగా కడిగిపారేసినట్టు తెలిసింది. ‘ఇప్పుడు అవసరం వచ్చేసరికి మేం గుర్తుకొచ్చామా? మేం ఫోన్లు చేస్తే కనీసం ఫోన్ కూడా ఎత్తవు.. ప్రజల సమస్యలపై సీఎంవోకు వస్తే దొంగలను చూసినట్టు చూస్తరు.. నియోజకవర్గ పనుల కోసం వస్తే ‘పైరవీల కోసమే వస్తున్నారు’ అని మీ అనుకూల మీడియాతో తప్పుడు రాతలు రాయిస్తారా?’ అని గట్టిగా నిలదీసినట్టు తెలిసింది. ‘అసలు మేం ప్రజాప్రతినిధులం అనుకుంటున్నారా? ఏం అనుకుంటున్నారు?’ అంటూ మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నిలదీసినట్టు తెలిసింది. పరిపాలనలో తమకు సరైన గౌరవం ఇవ్వకుండా, కేవలం సీఎం పీఠం ప్రమాదంలో పడినప్పుడే ఎమ్మెల్యేలు గుర్తుకువస్తరా? అని నిజామాబాద్‌కు చెందిన మరో ఎమ్మెల్యే కూడా వేం నరేందర్‌రెడ్డిని తీవ్ర స్వరంతో నిలదీసినట్టు కాంగ్రెస్ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతున్నది.
సీఎం శిబిరం నుంచి పదేపదే సంప్రదింపులు జరిపినా, పలువురు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చేందుకు ససేమిరా అన్నట్టు తెలిసింది. అటు అధిష్ఠానం తీసుకునే నిర్ణయాలు, ఇటు భవిష్యత్తు రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుంటూ మెజారిటీ నేతలు ఆచితూచి అడుగులు వేయాలని అనుకుంటున్నట్టు సమాచారం. ఇదే ఇప్పుడు రేవంత్ శిబిరానికి అసలైన తలవొప్పిగా మారింది. ప్రభుత్వం కొనసాగుతున్న తరుణంలోనే ఎమ్మెల్యేల మద్దతును బహిరంగంగా నిరూపించుకోవాల్సిన పరిస్థితి తలెత్తడంతో మెజారిటీ ఎమ్మెల్యేలు పార్టీ వైపే మొగ్గుచూపినట్టు తెలిసింది. రేవంత్‌రెడ్డి నాయకత్వాని వాళ్లు కనీసం పరిగణనలోకి కూడా తీసుకోనట్టు తెలిసింది.
సుస్మిత వ్యవహారం తాతాలిక వివాదమే అయినా సురేఖపై పార్టీ చర్యలు తీసుకున్నా.. తీసుకోకపోయినా ఈ ఎపిసోడ్ మాత్రం సీఎం రేవంత్‌రెడ్డి బలాన్ని స్పష్టం చేసిందని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. సీఎంగా ఉంటూ కేవలం 17మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీల మద్దతునే కూడగట్టగలగడం ఆయన నాయకత్వ బలహీనతను బయటపెట్టిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. తెలంగాణ కాంగ్రెస్‌లో అంతా సీఎం చెప్పినట్టే జరుగుతున్నదనే ప్రచారానికి దాదాపు తెరపడ్డట్టే అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ బలహీన ప్రదర్శన సీఎం ప్రత్యర్థులు, ప్రతిపక్షాలకు రాజకీయ ఆయుధమే అవుతుందని వారు అంటున్నారు. మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేల్లో ఒకరు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అతను సీఎం శిబిరంలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికే వెళ్లి ఉంటారని చెప్తున్నారు. మరో వైపు అసంతృప్త నేతలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అధిష్ఠానం వద్ద తమ వాణిని మరింత బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. అంతిమంగా, సొంత బలాన్ని చాటబోయి ఎదురుదెబ్బ తిన్న ఈ ఎపిసోడ్ రేవంత్ శిబిరాన్ని తీవ్ర ఆత్మరక్షణలోకి నెట్టేసిందనే చర్చ జోరందుకున్నది.