ఎదులాపురం, నవంబర్ 20: ప్రేమించి పెండ్లి చేసుకున్నదని కన్నోళ్లు వదిలేశారు.. పక్షవాతం వచ్చిందని కట్టుకున్నోడు విడిచిపెట్టాడు.. కన్నబిడ్డలను పెంచేందుకు అద్దె ఇంట్లో ఉంటూ, ఒంటి చేత్తో పనులు చేస్తూ నరకం అనుభవిస్తున్నది ఓ అభాగ్యురాలు. కరెంటు బిల్లు కూడా కట్టలేక, చిమ్మచీకట్లో జీవితాన్ని వెళ్లదీస్తున్నది. ఆదిలాబాద్‌కు చెందిన కనాకే ఆర్తి.. స్థానికుడైన అమూల్‌ను ఏడేండ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నది. దీంతో తల్లిదండ్రులు ఆమెను దూరం పెట్టారు. అత్తింటివారి ఆదరణ లేదు. ఆర్తి, అమూల్ కూలి పని చేసుకొంటూ రిక్షా కాలనీలో అద్దె ఇంట్లో ఉండేవాళ్లు. వీరికి గణేశ్(6), రేణుక (3), దేవిక (1) పిల్లలు. అమూల్ తాగొచ్చి ఆర్తిని చిత్రహింసలు పెట్టడంతో పక్షవాతానికి గురైంది. ఎడమ కాలు, చేయి పనిచేయవు. దీంతో ఆరు నెలల కిందట భార్యాపిల్లలను వదిలి అమూల్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒంటరిదైన ఆర్తి, పక్షవాతంతో పనిచేసే పరిస్థితి లేదు. ఏడు నెలలుగా అద్దె(నెలకు రూ.1,500) చెల్లించకపోవటంతో యజమాని నుంచి ఒత్తిడి పెరిగింది. బిల్లు కట్టలేదని కరెంట్ కనెక్షన్ తీసేశారు. ఆర్తి దీన స్థితిని గమనించిన స్థానిక అంగన్వాడీ టీచర్ విఠాబాయి ముగ్గురు పిల్లలకు, తల్లికి ఒకపూట భోజనం సమకూరుస్తున్నది. కాలనీ వాళ్లు ఇచ్చే చిల్లరతో పాపకు రాత్రిపూట పాలు కొంటున్న ది. పైసల్లేకపోతే ఆ రోజు పాపకూ పస్తులే. తోడు లేకున్నా, పిల్లల కోసం నిస్సహాయ స్థితిలో బతికి ఉన్న తనను ఆదుకోవాలని ఆర్తి కోరుతున్నది. బ్యాంక్ ఖాతా, ఫోన్ కూడా లేని ఆర్తికి సహాయం చేయాలనుకొనేవాళ్లు.. అంగన్వాడీ టీచర్ విఠాబాయి-95500 63032కి ఫోన్ చేసి సంప్రదించవచ్చు.