జడ్చర్ల టౌన్, జూన్ 29 : కాంగ్రెస్ పాలనలో జడ్చర్ల నియోజకవర్గం అక్రమాలకు అడ్డాగా మారిందని, రాచరిక పాలన సాగుతున్నదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆరోపించారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని ప్రేమ్‌రంగా గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే అనుచరుల అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని విమర్శించారు. అధికారిక కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టటమే కాకుండా కల్యాణలక్ష్మి చెక్కులను ఇస్తున్నారని అన్నారు. ప్రొటోకాల్ విషయంలో ఏం చేస్తున్నారో అధికారులే ఆలోచించుకోవాలని సూచించారు.
జడ్చర్లలో వందపడకల దవాఖాన కోసం పట్టాదారులకు తాను సొంత డబ్బులిచ్చి 2 ఎకరాలు సేకరించానని, దమ్ముంటే పక్కనే ఉన్న మరో రెండు ఎకరాలను కొనుగోలు చేసి క్రిటికల్ కేర్ సెంటర్ కట్టించాలని ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. రాజకీయ స్వార్థం కోసం ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి రాజకీయాల్లో ఏనాడూ జోక్యం చేసుకోని తన కుటుంబ సభ్యులపై అనవసరంగా ఆరోపణలు చేయటం సరికాదని అన్నారు.
తన సోదరి పేరిట 2 ఎకరాల భూమి ఉన్నట్టు చూపిస్తే 100 పడకల దవాఖానకే ఇచ్చేస్తానని ప్రకటించారు. లేనిపక్షంలో ఆరోపణలు చేసిన ఎమ్మెల్యేపై తన సోదరి పరువునష్టం దావా వేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యే స్వగ్రామమైన రంగారెడ్డిగూడలో ఆలయ భూముల వివరాలు, ఆదాయంపై శ్వేతపత్రం విడుదల చేయాలని సూచించారు.