హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): పిచ్చోడి చేతిలో రాయిలా రాష్ట్ర బీజేపీని బండి సంజయ్ చేతిలో పెట్టారని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రెచ్చగెట్టే వ్యాఖ్యలు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న అతడిని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. మంగళవారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. శవాలు దొరికితే మీవి.. శివాలు దొరికితే మావి అన్నట్టుగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమా.. పార్టీ విధానమా తేల్చాలని డిమాండ్ చేశారు.
ప్రజల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధులు నూపుర్‌శర్మ, నవీన్‌కుమార్ జిందాల్‌ను సస్పెండ్ చేసినట్టు బండిని కూడా సస్పెండ్ చేయాలని అన్నారు. లేదంటే బండిపై ప్రభుత్వమే చట్టపరమైన చర్యలు తీసుకుంటుదని చెప్పారు. ప్రధాని మోదీ దగ్గరి నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలు ఇలా అన్నిస్థాయిల్లో అబద్ధాలు ప్రచారం చేయటమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. తెలంగాణలో విజయవంతమైన సంక్షేమ పథకాలను కాపీ కొట్టడమే కాకుండా వాటిని తామే ప్రవేశపెట్టామని కేంద్రం నిస్సిగ్గుగా చెప్పుకుంటుందని ధ్వజమెత్తారు.
హైదరాబాద్ అభివృద్ధికి ఏమాత్రం సహకరించని, రాష్ట్ర ప్రగతికి పాటుపడని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా బీజేపీ నేతలు ఇస్తున్న ప్రకటనలు తక్షణమే మానుకోవాలని హితవు పలికారు. ఢిల్లీకి వెళ్లిన బీజేపీ కార్పొరేటర్లతో మోదీ ఫొటోలకు ఫోజులు ఇచ్చి పంపకుండా హైదరాబాద్ అభివృద్ధికి కనీసం రూ.2 వేల కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలా నిధులు తెస్తే తాము ఎయిర్‌పోర్టుకు వెళ్లి కార్పొరేటర్లకు పూలమాల వేసి స్వాగతం పలుకుతామని చెప్పారు.