హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోసారి ట్విట్టర్ యూజర్లకు మరో ప్రశ్న సంధించారు. ట్విట్టర్లకు సండే క్విజ్ అని కేటీఆర్ సంబోధిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడుంది? అని ప్రశ్నించారు.
గత గురువారం మంత్రి కేటీఆర్ ఓ ఫోటోను షేర్ చేసి ఇది ఎక్కడుందో చెప్పగలరా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ఫోటోను కేటీఆర్ నాడు షేర్ చేశారు. తాజాగా అమెజాన్ క్యాంపస్ భవనం చిత్రాన్ని కేటీఆర్ షేర్ చేసి.. ఇది ఎక్కడుంది? అని అడిగారు. మరి ఆ క్యాంపస్ ఎక్కడుందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఒకసారి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని నానక్‌రామ్‌గూడకు వెళ్లాల్సిందే.
Sunday pop quiz tweeple;
— KTR (@KTRTRS) January 16, 2022
Where is the world’s largest campus of Amazon located? pic.twitter.com/1cNEWBaXsU
అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ భవనాన్ని హైదరాబాద్‌లో 2019లో ప్రారంభించింది. ఈ భవనాన్ని నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలికవసతులతో నిర్మించారు. 15 అంతస్తుల భవనంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో పార్కింగ్ ప్రదేశం, మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పనిచేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. దీన్ని 21 ఆగస్టు, 2019న ప్రారంభించారు. ఈ క్యాంపస్ ద్వారా 9 వేల మంది ఉద్యోగులకు ఉపాధి లభిస్తుంది. అమెజాన్‌కు చెందిన వివిధ గ్లోబల్ బిజినెస్, టెక్నాలజీ టీమ్స్ బ్యాకెండ్ కార్యకలాపాలను ఇక్కడ నుంచే ఉద్యోగులు నిర్వహించనున్నారు. 2016, మార్చి 31న అమెజాన్ క్యాంపస్‌కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు.