Peanut | పెద్దఅంబర్‌పేట, ఏప్రిల్ 28: పల్లిగింజ గొంతులో ఇరుక్కుని ఓ చిన్నారి ఊపిరి విడిచిన ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం లష్కర్‌గూడలో చోటుచేసుకున్నది. అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసుల కథనం ప్రకారం.. లష్కర్‌గూడకు చెందిన బండారి మహేశ్వరి- శ్యామ్‌సుందర్ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె తన్విక(4).. ఆదివారం ఇంట్లో వేయించిన పల్లీలు తిన్నది.
ఓ పల్లిగింజ గొంతులో ఇరుక్కుని ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో తల్లిదండ్రులకు తెలిపింది. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు.. నగరంలోని నీలోఫర్ దవాఖానకు తరలించారు. పరీక్షించిన వైద్యులు.. గొంతులో పల్లి ఇరుక్కుపోయినట్టు నిర్ధారించారు. సోమవారం చికిత్స పొందుతుండగానే.. పరిస్థితి విషమించి తన్విక ప్రాణం విడిచింది. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.