గజ్వేల్, జూలై 30: ‘కేసీఆర్ ఉన్నప్పుడే నయముండే. తీసుకుంటే జాగలు తీసుకుండు కానీ అందరికీ మేలు చేసిండు. కాలువల్లో చేతికి అందేలా నీళ్లు ఉండేవి. ఇప్పుడైతే కాలువల్లో తుంగ మొలిచి ఎండిపోయింది. కేసీఆర్ ఎప్పుడు పంటలు పండించుకునేందుకు కాలువల్లో నీళ్లు ఉంచితే.. వీళ్లయితే ఇప్పటివరకు నీళ్లను కాలువల్లోకి వదలలేదు’ అని సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామానికి చెందిన గొర్లకాపర్లు దుప్పటి వీరయ్య, మల్లంపల్లి అంజయ్య, నీలం ఐలయ్య అన్నారు.
మంగళవారం గౌరారం గ్రామ సమీపంలో గొర్లకాపర్లు జీవాలు మేపుతుండగా ‘నమస్తే తెలంగాణ’ వారిని పలుకరించగా తమ బాధలను చెప్పుకొచ్చారు. ‘ఇప్పుడు గొర్లకు నీళ్లు దొరకుతలేవంటే ఎట్లా ఉందో మీకే తెలువాలే. కేసీఆర్ గొర్లు ఇస్తే వాటికి నీళ్లు ఇచ్చేటోడు.. ఇప్పుడు ఇచ్చే దిక్కులేదు. ఇట్లుంది మా పరిస్థితి. భగవంతుడేమో వర్షాలు ఇస్తాలేడాయే. ఎట్లా బతికేది మేము?. మా ఊర్లోని బందం చెరువు ఎప్పుడు అలుగు పారుతుండే. ఇప్పుడేమో ఎండిపోయింది. మాట్లాడుకుంటే ఏమీ లాభం. కేసీఆర్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ఆస్మాన్ పరక్ కనిపిస్తుంది’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.