హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఎంతో కీలకమైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ (పీఆర్ఆర్డీ)లో ఉద్యోగులెందరో ప్రమోషన్ల కోసం చాలాకాలంగా ఎదురు చూస్తున్నారు. అర్హులైన సీనియర్ అధికారుల జాబితాను ఆరు నెలల క్రితమే ప్రభుత్వానికి పంపినా పట్టింపులేదు. మరోసారి పంపించినా సీఎం కార్యాలయం నుంచి స్పందనే కరువైంది. దీంతో వారికి ఎదురుచూపులు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 539 ఎంపీడీవో పోస్టులు ఉండగా, దాదాపు 120 పైచిలుకు పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అధికారవర్గాలు తెలిపాయి. జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారులు (డీపీవో) 32 మంది ఉన్నారు. వీరంతా పదోన్నతుల కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నా రు. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 37 జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ (డీసీవో) పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. ఆ 37 పోస్టుల కోసం ప్రమోషన్లకు అర్హులైన సీనియర్ అధికారులు సుమారు 100 మందికిపైగా పోటీపడుతున్నారు.
ఒక్క పోస్టుకు ముగ్గురు పోటీ
ఒక్క పోస్టు ప్రమోషన్ కోసం ముగ్గురు అధికారుల పేర్లతో కూడిన జాబితా పంపినట్టు అధికారవర్గాలు తెలిపాయి. 6 నెలల క్రితం కూడా ప్రమోషన్లకు సంబంధించిన అధికారుల జాబితాను పంపించారు. ఆరు నెలలైనా ఆ జాబితాకు మోక్షం కలుగకపోవడంతో మరోసారి జాబితాను పంపాలని ఉన్నతాధికారులు సూచించినట్టు తెలిసింది. ఆ మేరకు నెల క్రితమే పంచాయతీరాజ్‌శాఖ నుంచి ప్రమోషన్లకు అర్హులైన అధికారుల జాబితాను ప్రభుత్వానికి అందజేసినట్టు సమాచారం. అందులో ప్రభుత్వ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, ఖాళీగా ఉన్న పోస్టులెన్ని అన్న వివరాలతో కూడిన నివేదికను సర్కారుకు అందజేసినట్టు తెలిసింది.