హైదరాబాద్: సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమాజంపై నిషేధాజ్ఞలు విధిస్తారా అని ప్రశ్నించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలన్నారు. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నదని చెప్పారు కేసీఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలలుగా రేవంత్ రెడ్డి చేసిందేముందన్నారు. జాబ్క్యాలెండర్ను జాబ్ లెస్ క్యాలెండర్ చేశారని మండిపడ్డారు.
‘ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్న సందర్భంగా విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామిక, పిరికిపంద చర్య. వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక్క విద్యార్థి మీద పోలీసు లాఠీ పడినా తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని హెచ్చరిస్తున్నాం. ఇందుకేనా విద్యాశాఖను, హోం శాఖను మీ వద్ద పెట్టుకున్నది. ఒక్క విద్యార్థులే కాదు, యావత్ తెలంగాణ మీరు ఇచ్చిన మోసపూరిత హామీల గురించి నిలదీస్తున్నది. మొత్తం తెలంగాణ సమాజం మీద నిషేధాజ్ఞలు విధిస్తారా?. ఏడో గ్యారంటీగా ప్రజాస్వామ్య పాలన అని చెప్పి, ఎమర్జెన్సీ రోజులను తిరిగి తెచ్చిండు రేవంత్ రెడ్డి.
కేసిఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం. కేసీఆర్ హయాంలో ఓయూలో శంకుస్థాపన చేసిన నిర్మాణాలను ప్రారంభించడం తప్ప 22 నెలలుగా నువ్వు చేసింది ఏముంది రేవంత్ రెడ్డి?. జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ చేసారు. మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని మోసం చేసారు. నిరుద్యోగ భృతి పేరిట నయవంచన చేసారు. 22నెలల్లో 10 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా 60వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నావు. నీ తప్పుడు ప్రచారంపై కడుపు మండిన విద్యార్థులు, నిరుద్యోగులు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నవు.
నెలల తరబడి విద్యార్థులు, నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తుంటే నువ్వు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ కాలం వెళ్లదీస్తున్నవు. గ్రంథాలయాల్లో పోలీసు లాఠీ చార్జీలు జరిపించిన అరాచక చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది. విద్యార్థులు, నిరుద్యోగుల వీపులు పగుల గొట్టిన అమానుష పాలన కాంగ్రెస్ ప్రభుత్వానిది. ఆంక్షలతో, నిషేధాలతో నిరుద్యోగుల హృదయాల్లో రగులుతున్న నిరసన జ్వాలలను చల్లార్చలేరు. ఇనుప కంచెలు, బ్యారికెడ్లతో ప్రజా తిరుగుబాటును ఆపలేరు. పోలీసు బలం, బలగంతో విద్యార్థుల నిరసన జ్వాలలను చల్లార్చలేరు.
ఉస్మానియా విద్యార్థి, నిరుద్యోగులు సింహాలై గర్జిస్తరు. ఉద్యోగాల పేరిట మీరు చేసిన మోసాన్ని ఎక్కడిక్కడ నిలదీస్తరు. మోసం చేసినందుకు ఉస్మానియా సాక్షిగా విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.’ అని హరీశ్ రావు అన్నారు.