హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): కంచ గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వెనక అసలేం జరిగింది? ప్రభుత్వ పెద్దలు ఏం చేయాలనుకున్నారు? విద్యార్థుల ఆందోళన.. పచ్చని చెట్లను సర్కారు నిర్దాక్షిణ్యంగా నేలమట్టం చేయడం జాతీయస్థాయిలో అట్టుడికించింది. కానీ అప్పటికే తెరవెనక జరిగిన అనేక పరిణామాలను లోతుగా పరిశీలిస్తే ఈ భూముల అమ్మకం వెనక భారీ ఎత్తుగడలే ఉన్నాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి అంశంలోనూ టీజీఐఐసీతో సర్కారు వేయించిన అడుగులను విశ్లేషిస్తే తామరతంపరలుగా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణంగా ఉమ్మడి రాష్ట్రం సహా గత ప్రభుత్వాలు భూముల వేలం ప్రక్రియలో అనుసరించిన విధానాలకు భిన్నంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చేసిన కసరత్తు ఈ సందేహాలకు బలాన్ని ఇస్తున్నది.
ముఖ్యంగా భూముల విలువను తగ్గించడం మొదలు చరిత్రలో తొలిసారిగా టీజీఐఐసీ ద్వారా ప్రభుత్వం రుణం పొందడం వరకు చోటుచేసుకున్న పరిణామాలు అన్నింటినీ క్రోడీకరిస్తే కేవలం ఖజానాకు నిధుల సమీకరణ కోసమే 400 ఎకరాల భూముల విక్రయం అంశాన్ని ప్రభుత్వ పెద్దలు భుజానికి ఎత్తుకోలేదనే సంగతి వెల్లడవుతుంది. హైడ్రా అంటూ సామాన్యుడికి నిబంధనలను వల్లించిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పదుల సంఖ్యలో అనుమతులు తీసుకోవాల్సిన చోట.. రాత్రికి రాత్రి.. హడావుడిగా బుల్డోజర్లతో వేలాది చెట్లను నేలకూల్చడమంటేనే ‘దాల్మే కుచ్ కాలాహై!’ అనిపిస్తున్నది.
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై సుప్రీంకోర్టు జోక్యంతో తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ భూముల వెనక ఎలాంటి కసరత్తులు చేసింది.. ఎలా చేసింది.. ఇలా ఎందుకు చేసింది? అనే చర్చ తీవ్రస్థాయిలో ఊపందుకుంది. గత ఏడాది మార్చిలో 400 ఎకరాల భూములు ప్రభుత్వానివేనంటూ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత నుంచి ఇటీవల సుప్రీంకోర్టు దాకా వివాదం వెళ్లే వరకూ జరిగిన పరిణామాలను చూస్తే ఈ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వం టీజీఐఐసీ ద్వారా భారీ కసరత్తును చేసింది. సాధారణంగా ప్రభుత్వపరంగా భూముల వేలం అనేది కొన్ని దశాబ్దాలుగా తెలుగు రాష్ర్టాల్లో జరిగిందే. కానీ ఈ పరిణామాలు మునుపెన్నడూలేని విధంగా ఉండటమే 400 ఎకరాల వెనక భారీ భూపందేరం దాగి ఉందనే ఆరోపణలకు తావిస్తున్నది. వాటిని ఓసారి పరిశీలిస్తే…
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఈ భూములను అమ్ముతున్నామని ఆది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఈ క్రమంలో భూముల విలువ పెరిగితే ప్రభుత్వ ఖజానాకు నిధుల సమీకరణ పెరుగుతుంది. కానీ ప్రభుత్వ పెద్దలు అందుకు భిన్నంగా ఆలోచించడం సందేహాస్పదంగా మారింది. నిరుడు జూన్‌లో జారీ అయిన జీవో 54లో ఎకరం ధర రూ.75 కోట్లుగా నిర్ధారించిన అధికారులు అందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన కోకాపేట, పరిసర ప్రాంత ప్రభుత్వ వేలం ప్రక్రియలను ఆధారంగా చూపారు. ఇది అక్షరాలా సత్యం అయినందున ఆ భూముల విలువ ఎంతో చెప్పేందుకు ఇంతకుమించిన సాక్ష్యం మరేదీ ఉండదు.
కానీ రేవంత్ సర్కారు గత ఏడాది నవంబరులో పరీశ్రావు పన్సే-రావు అసోసియేట్స్ అనే ప్రభుత్వ అనుమతి ఉన్న వాల్యుయేషన్ సంస్థ ద్వారా తెప్పించుకున్న నివేదికలో ఏకంగా ఎకరాకు రూ.23 కోట్లు తగ్గడం అందరినీ విస్మయానికి గురిచేస్తున్నది. ఒకవేళ ఆ సంస్థ తూతూమంత్రంగా నివేదిక ఇచ్చిందనుకున్నా… గతంలో ప్రభుత్వ జీవోలోనే ఎకరం ధర రూ.75 కోట్లుగా నిర్ధారించినందున ప్రభుత్వ పెద్దలు వెంటనే అభ్యంతరం వ్యక్తం చేయాలి. కానీ ఇక్కడ అలా జరగకపోగా దాని ఆధారంగానే రూ.10వేల కోట్ల రుణం తీసుకురావడమంటే సర్కారు పెద్దల కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందనేందుకు నిదర్శనం. అంటే ప్రభుత్వంలోని వారు ఈ భూముల ధరను ఎందుకు తగ్గించాలనుకున్నారు? దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు ఎలాగూ ప్రయోజనం ఉండదనేది అందరికీ తెలిసిందే. అలాంటప్పుడు ఈ తగ్గింపు ఎవరికి, ఏ రూపంలో లాభాన్ని చేకూరుస్తుంది?
సాధారణంగా ప్రభుత్వాలు బహిరంగ మార్కెట్లో రుణాలకు వెళ్లినప్పుడు జాతీయ బ్యాంకులను ఆశ్రయిస్తాయి. ప్రధానంగా ఎంతో విలువైన భూములను తనఖా పెడుతున్నందున సులువుగా ఎస్బీఐలాంటి జాతీయ బ్యాంకుల ద్వారా రుణాలు వస్తాయని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఎస్బీఐలాంటి జాతీయ బ్యాంకులను కాదని ఐసీఐసీఐ వంటి ప్రైవేటు బ్యాంకును ఎందుకు ఆశ్రయించిందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకోసం మధ్యవర్తిగా బీకాన్ ట్రస్టీషిప్ అనే సంస్థ వ్యవహరించింది.
అయితే 400 ఎకరాలను విక్రయించాలని నిర్ణయించిన ప్రభుత్వం అంతకుముందే భూములను తనఖా పెట్టి రూ.10వేల కోట్ల రుణం ఎందుకు తీసుకుంది? పైగా రుణం తీసుకునే సమయంలోనే అమ్మాలనే ఆలోచన ఉందనేది అందులోని షరతులను చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే షరతుల్లో భాగంగా ఈ భూములను అమ్మి రుణాన్ని తిరిగి చెల్లించేందుకు వెసులుబాటు పెట్టుకున్నారు. అలాంటప్పుడు నేరుగా వేలం పాటకు వెళ్లకుండా ముందుగా రుణానికి పోవడమెందుకు? ఈ వ్యవధిలోనే భూ పందేరానికి సంబంధించిన అనధికారిక ఒప్పందాలను ముగించారనే ఆరోపణలు వినవస్తున్నాయి. పైగా ఒకే భూములపై రుణం-వేలం నిర్వహించాలనుకోవడం ఇదే తొలిసారి అని కూడా అధికారులు కొందరు చెబుతున్నారు.
కేసీఆర్ ప్రభుత్వం ఎడాపెడా అప్పులు చేసిందంటూ కోడైకూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి సహా మంత్రులు, కాంగ్రెస్ నేతలు ప్రధానంగా కార్పొరేషన్ల ద్వారా రుణాలు తీసుకోవడాన్ని ఒక పెద్ద నేరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి రాకుండా ఉండేందుకు కాళేశ్వరం, ఇతరత్రా కార్పొరేషన్లను ఏర్పాటుచేసి రుణాలు తీసుకున్నారంటూ అసెంబ్లీలోనే కాదు మీడియా ముందు అనేకసార్లు ముఖ్యమంత్రి విమర్శించారు. కానీ ‘తెలంగాణ పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ’ ద్వారా రూ.10వేల రుణం తీసుకురావాలంటూ అదే నోటితోనే సీఎం అధికారులను ఆదేశించారు.
పైగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జాతీయ ఆర్థిక సంస్థలు, జాతీయ బ్యాంకులతోనే ఒప్పందాలు చేసుకుంది. ముఖ్యంగా కేసీఆర్ హయాంలో జరిగిన ప్రక్రియలో కమీషన్లు అంటూ నిరాధార ఆరోపణలతో కాళేశ్వరం, విద్యుదుత్పత్తి కేంద్రాలపై న్యాయ కమిషన్లు వేసిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రైవేటు సంస్థలతో చేసిన లావాదేవీలు మాత్రం అత్యంత పారదర్శకమని జనం నమ్మాలా? ముఖ్యంగా కేసీఆర్ ప్రభుత్వం చేస్తే అప్పెలా అవుతుంది? రేవంత్‌రెడ్డి సర్కారు రుణం తెస్తే లోకకల్యాణం ఎలా అవుతుంది? అనే సూటి ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి.
ఉమ్మడి ఏపీ సహా గత పదేండ్లలోనూ ఏనాడూ పరిశ్రమల మౌలిక వసతుల కల్పన సంస్థను పారిశ్రామికాభివృద్ధికే వినియోగించిన దాఖలాలున్నాయి. బహుశా తొలిసారి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రుణం పొందేందుకు వినియోగించిందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే గతంలోనూ జరిగిన భూముల వేలంలో ప్రధానంగా హెచ్ఎండీఏ కీలక పాత్ర పోషించింది. లేఅవుట్‌ను అభివృద్ధి చేయడంలో భాగంగా భూమిని ప్లాట్లుగా (ల్యాండ్ పార్శిల్స్) చేయడం, రహదారులు, విద్యుత్తు, డ్రైనేజీ వంటి మౌలిక వసతులను కల్పించడం వరకు ప్లానింగ్, పనుల నిర్వహణ అంతా హెచ్ఎండీఏ వేలాది ఎకరాల్లో ఒంటి చేత్తో చేసిన సందర్భాలున్నాయి.
టీజీఐఐసీ కూడా నిర్వహించింది. కానీ 400 ఎకరాల వేలం ప్రక్రియలో భాగంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తొలిసారిగా లావాదేవీల సలహాదారు (ట్రాన్సాక్షనల్ అడ్వయిజరీ) కోసం ఆర్పీఎఫ్ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) నోటిఫికేషన్ జారీ చేసింది. కాంట్రాక్టు సంస్థలకు రూ.1000 కోట్లకు పైగా టర్నోవర్ ఉండాలి… రూ.800 కోట్లు వెచ్చించే సామర్థ్యం ఉండాలంటూ సవాలక్ష నిబంధనలతో టెండర్ల ప్రక్రియ చేపట్టింది. సమర్థమైన అధికార యంత్రాంగం ఉన్న హెచ్ఎండీఏ, టీజీఐఐసీని కాదని మాస్టర్‌ప్లాన్, లేఅవుట్ డిజైన్, వేలం పక్రియ నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై అధికారవర్గాల్లోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారం జాతీయ స్థాయిలో సంచలనమైన తర్వాత రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నష్ట నివారణ చర్యల్లో భాగంగా మంత్రులతో కమిటీని వేసింది. ఇందులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని నియమించారు. ఆర్థిక శాఖ కోణంలో భట్టి, పరిశ్రమలు, ఐటీతో జిల్లా మంత్రి కోణంలో శ్రీధర్‌బాబు, భూముల విషయమైనందున పొంగులేటి నియామకం వరకు బాగానే ఉంది.
కానీ అసలు సుప్రీంకోర్టు దాకా వ్యవహారం పోవడం వెనక ప్రధాన కారణం… రాత్రికి రాత్రి వేలాది పచ్చని చెట్లను కూల్చి, మూగజీవాలకు నిలువ నీడ లేకుండా చేయడమే కాకుండా అరుదైన జీవ వైవిధ్యాన్ని ధ్వంసం చేయడమే. ఈ కోణంలో కచ్చితంగా అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖ కమిటీలో ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. కానీ అందుకు భిన్నంగా ఆమెకు స్థానం కల్పించకపోవడం వెనక అసలు ఆంతర్యమేమిటి? అనే అనుమానాలు
వ్యక్తమవుతున్నాయి.
శకునం చెప్పే బల్లి కుడితిలో పడినట్టు.. హెచ్‌సీయూ భూముల విషయంలో రేవంత్‌రెడ్డి సర్కారు తీరు ఉంది. ప్రభుత్వ అనుమతులతో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వందలాది సామాన్యుల ఇండ్లను నిబంధనల పేరిట ఈ ప్రభుత్వం కూల్చివేస్తున్నది. చెరువులను చెరబడితే చెరసాలనే అని సీఎం రేవంత్‌రెడ్డే అల్టిమేటం ఇచ్చారు. కానీ అదే ప్రభుత్వం అటవీ, పురపాలక, పర్యావరణ, రెవెన్యూ చట్టాలను వందల బుల్డోజర్లతో తొక్కించి.. రాత్రికి రాత్రి హెచ్‌సీయూ భూముల్లో దండయాత్రకు వెళ్లింది. వాస్తవానికి అది ప్రభుత్వానికి చెందిన భూమి అయినప్పటికీ.. 20 వేల చదరపు మీటర్లకు మించి విస్తీర్ణంలో చెట్లను నరికివేయాలంటే కచ్చితంగా హైడ్రా, కాలుష్య నియంత్రణ మండలి, జీహెచ్ఎంసీ/హెచ్ఎండీఏ, రెవెన్యూ, అటవీ, పర్యావరణ, బయో డైవర్సిటీ అథారిటీ, ఆర్కియాలజీ… ఇలా పదుల సంఖ్యలో శాఖల నుంచి అనుమతి తీసుకోవాలని చట్టాలు చెప్తున్నాయి.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవేవీ పాటించలేదు. పైగా లేఅవుట్ అభివృద్ధి కోసం టీజీఐఐసీ ఆర్పీఎఫ్ నోటిఫికేషన్ జారీచేసింది. అంటే ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన కంపెనీ మాస్టర్‌ప్లాన్ రూపొందించి, డిజైన్ తయారు చేసి, భూమిని చదును చేస్తుంది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం గత నెల 30వ తేదీ అర్ధరాత్రి హడావుడిగా బుల్డోజర్లతో దాదాపు వంద ఎకరాలకు పైగా చెట్లను నరికి, భూమిని ఎందుకు చదును చేసింది? తెల్లారితే భూమి చేజారిపోతుందనే రీతిలో అర్ధరాత్రి ఇంత హడావుడి చెట్లు నరకడం వెనక దాగి ఉన్న మర్మమేంది? అనే సందేహాలు వినిపిస్తున్నాయి.