కాంగ్రెస్ అంటేనే అంత. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా, అధికారంలోకి వచ్చాక ఒకలా ప్రవర్తించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య. రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజాప్రయోజనాలు పట్టని పార్టీ అది. బీఆర్ఎస్ హయాంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టుపై నానా యాగీ చేసింది. వనరులు లేని చోట ప్రాజెక్టు ఎలా పెడతారంటూ గాయిగాయి చేసింది. చివరికి దానిని విచారణ అంశంలోనూ చేర్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ అదానీ సిమెంట్ ఫ్యాక్టరీకి అడ్డగోలు అనుమతులిచ్చింది. విచిత్రం ఏంటంటే.. అప్పుడు వనరులు లేవని గోలగోల చేసిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కనుచూపు మేరలో వనరులన్నవే లేని చోట సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అనుమతులిచ్చింది. అది కూడా ఫ్యాక్టరీ చట్టాలను తుంగలో తొక్కి. కాంగ్రెస్ ద్వంద్వనీతికి ఇంతకుమించిన సాక్ష్యం ఇంకేం కావాలి.
Congress | యాదాద్రి భువనగిరి, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): తాను చేస్తే సంసారం.. పక్కోడు చేస్తే వ్యభిచారం అన్నట్టు తయారైంది కాంగ్రెస్ పార్టీ తీరు. నాడు అన్ని వనరులు, ముడిసరుకు ఉన్నా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను తప్పుబట్టిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జీరో రా మెటీరియల్ ఉన్న రామన్నపేట అదానీ అంబుజా సిమెంట్ కంపెనీకి మాత్రం దాసోహం అంటున్నది. కనీసం ముడి సరుకు కూడా లేకపోవడంతో నిత్యం వందలాది భారీ వాహనాల రాకపోకలతో అక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా మారనుంది. జిల్లా ఇప్పటికే ఫార్మా కాలుష్య రక్కసిలో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. అంతకంటే ముందు నల్లగొండ ప్రజలు ఏండ్ల తరబడి ఫ్లోరైడ్‌తో జీవచ్ఛవాలుగా మారారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మిషన్ భగీరథతో సురక్షిత తాగునీరు అందించి ఫ్లోరైడ్ రక్కసిని రూపుమాపారు. ప్రస్తుతం పల్లెలు పచ్చగా ఉన్న ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అదే పల్లెల మీద దాడికి దిగుతున్నది.
నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం వీర్లపాలెం వద్ద యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను జనావాసాలకు దూరంగా నిర్మించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా కృష్ణానది ఒడ్డున స్థాపించారు. పర్యావరణానికి ముప్పు వాటిల్లే అవకాశం కూడా పెద్దగా లేదు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక వ్యయాన్ని సైతం ప్రభుత్వం భరించింది. అలాంటి ప్రాజెక్టునే నాడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇప్పుడు అదే పార్టీ అదానీకి దాసోహం అయింది. రామన్నపేట నడిబొడ్డున, రీజినల్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్‌రోడ్డుకు దగ్గర్లో సిమెంట్ కంపెనీ స్థాపనకు అనుమతులిచ్చింది.
రామన్నపేటలో స్టాండ్ అలోన్ సిమెంట్ గ్రైండింగ్ యూనిట్లో ఏటా 6 ఎంఎంటీపీఏ సిమెంట్ ఉత్పత్తికి ప్రతిపాదనలు చేశారు. ఇక్కడ వనరులు, ముడి సరుకు లేకున్నా ఎందుకు ఏర్పాటు చేస్తున్నారో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగా మారింది. సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఎన్నో అవసరాలు ఉంటాయి. ముఖ్యంగా సున్నపురాయి గనులు ఉండాలి. జిప్సం, బూడిద ఫ్లై స్లాగ్ అందుబాటులో ఉండాలి. కానీ ఇవేవీ ఇక్కడ లేవు. వీటితోపాటు హెచ్ఎస్డీ బొగ్గు కూడా నిల్వ చేస్తామని అదానీ తన నివేదికలో పేర్కొన్నది. మరోవైపు సరిపడా నీరు కూడా లేదు. ధర్మారెడ్డిపల్లి కాల్వ మినహా ఇతర వనరులు లేవు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గం అయిన రామన్నపేటను నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పునర్విభజనలో తొలగించింది. రూపురేఖలు లేకుండా రామన్నపేటను మార్చేసింది. మళ్లీ ఇప్పుడు సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో మండలాన్ని ఆగం చేయాలని కంకణం కట్టుకున్నది.
సిమెంట్ కంపెనీ కోసం స్థానికంగా వనరులు లేకపోవడంతో ముడిసరుకును ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో నిత్యం ఈ ప్రాంతం నుంచి పెద్దఎత్తున భారీ వాహనాలను రవాణాకు ఉపయోగించాల్సి ఉంటుంది. 175 భారీ వాహనాలు ముడి సరుకును రవాణా చేయనున్నట్టు అదానీ తన రిపోర్ట్‌లో తెలిపింది. భారీ వాహనాల నుంచి 24 గంటల పాటు వచ్చే శబ్దాలు, దుమ్ము, ధూళితో జనజీవనం అస్తవ్యస్తంగా మారే ప్రమాదం ఉంది. చిన్న పిల్లలు ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ప్రస్తుతం రవాణా కోసం 30 ఫీట్ల రోడ్డు మాత్రమే ఉంది. రామన్నపేట నుంచి కొమ్మాయిగూడెం మీదుగా పెద్దకాపర్తి దాటితే హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి ఉంది. ఇక్కడ ఇప్పుడున్న 30 అడుగుల రోడ్డును 100 అడుగులకు విస్తరించనున్నారు. అదే జరిగితే రోడ్డు విస్తరణలో కొమ్మాయిగూడెం, పెద్దకాపర్తి గ్రామాల్లోని వందలాది ఇండ్లు నేలమట్టం అవుతాయి. మరోవైపు పక్కనే ఉన్న రామన్నపేట రైల్వే స్టేషన్ నుంచి కంపెనీ వరకు ట్రాక్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టు తెలిసింది.
ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతాల్లోనే కంపెనీలు ఏర్పాటు చేయాలి. జనాలు ఉండే రామన్నపేటలో సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఏంటి? అసలు ఇక్కడ ఎలాంటి వనరులూ లేవు. ఏ ఉద్దేశంతో కంపెనీని స్థాపిస్తున్నారు. నాడు యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ను కాంగ్రెస్ ఎలా వ్యతిరేకించింది? ఇప్పుడు అంబుజాకు ఎందుకు అనుమతి ఇస్తున్నది? కంపెనీ ఏర్పాటు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదు. ప్రజలకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం.
కాంగ్రెస్ పార్టీ అదానీకి అమ్ముడుపోయి అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నది. స్కిల్ యూనివర్సిటీకి అదానీ 100 కోట్లు ఎందుకు ఇచ్చాడు? లోపాయికారి ఒప్పందాలు చేసుకుని ప్రజలను ఆగం చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తున్నది. వనరులు లేకుంటే ఇతర ప్రాంతాల నుంచి తెచ్చుకోవాలి. 24 గంటలు తిరిగే భారీ వాహనాలతో ప్రజలు ఏమై పోవాలి? రోడ్లు వెడల్పు చేస్తే వందలాది ఇండ్లు పోతయి. ప్రాణాలు పోయినా పరిశ్రమను పెట్టనివ్వం. ప్రజాభిప్రాయ సేకరణలో మా అభిప్రాయాన్ని చెప్పి అడ్డుకుంటాం.