Dasharathi | హైదరాబాద్, జూలై 17(నమస్తే తెలంగాణ): అభ్యుదయ కవిసామ్రాట్ డా. దాశరథి కృష్ణమాచార్యను రాష్ట్ర సర్కారు విస్మరించిందా? అంటే సాహితీవేత్తల నుంచి అవుననే సమాధానం వస్తున్నది. తెలంగాణ సాయుధ పోరాటంలో, సాహితీ రంగంలో ఆయన విశిష్టత, ప్రత్యేకత ఉన్నది. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’, ‘మా నిజాం రాజు జన్మజన్మల బూజు’ అనే మాటలు నేటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నుంచి దాశరథి సాహితీ పురస్కారాన్ని అందిస్తున్నది. ఈ శత జయంతి సంవత్సరాన్ని గొప్పగా జరుపుకోవాలని సాహితీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వేడుకలు, పురసారంపై ప్రకటన రాకపోవడంపై సాహితీవేత్తలు విచారం వ్యక్తంచేస్తున్నారు.
22న ఎమ్మెల్సీ గోరటికి పురస్కారం
సాహితీ సాంస్కృతిక వేదిక ‘మాభూమి’ ఆధ్వర్యంలో ఈ నెల 22న మాభూమి- దాశరథి ప్రజా సాహిత్య పురసారాన్ని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు ప్రదానం చేయనున్నారు. హైదరాబాద్ జిల్లా అదనపు జడ్జి మురళీమోహన్ అధ్యక్షతన కార్యక్రమం జరుగుతుంది.