హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఆగ్నేయ దిశగా వాయుగుండం కొనసాగుతున్నది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బుధ, గురు, శుక్రవారాల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో వానలు పడతాయని ప్రకటించింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.