ఖమ్మం : ఖమ్మంలో సమీకృత కలెక్టరేట్ కార్యాలయ భవనాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రులు కేజ్రీవాల్, భగవంత్ మాన్, పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్‌యాదవ్, సీపీఐ జాతీయ నేత రాజా తదితరులకు ఘనస్వాగతం లభించింది.
కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రెండు హెలీప్యాడ్లలో ముఖ్యమంత్రులు, మంత్రులు హెలీకాప్టర్ల ద్వారా దిగారు.అక్కడ ముఖ్యమంత్రులు, అతిథులకు ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, ఇల్లెందు శాసనసభ్యురాలు హరిప్రియానాయక్ సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి హారతులిచ్చారు.
మంత్రులు హరీశ్‌రావు, పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీలు నామా నాగేశ్వరరావు, బండి పార్ధసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, కలెక్టర్ వీపీ.గౌతమ్ ఘనస్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో గౌరవ వందనం స్వీకరించారు. సీఎం కేసీఆర్‌తో పాటు సీఎంలు, మాజీ సీఎం, సీపీఐ నాయకులు బస్సులో కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు. కలెక్టరేట్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలను, ప్రజాప్రతినిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిచయం చేశారు. రెండు హెలీప్యాడ్ల వద్ద పోలీసు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.