హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో ‘సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్’ (నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం-సీ4ఐఆర్)ను ఏర్పాటుచేయనున్నట్టు వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ప్రకటించింది. బయో ఏషియా-2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు తెలిపింది. ఆరోగ్య సంరక్షణ, లైఫ్‌సైన్సెస్ రంగాల్లో సాంకేతిక వినియోగాన్ని అభివృద్ధి పరిచేందుకు సీ4ఐఆర్ దోహదపడనున్నది. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో నిర్వహిస్తున్న (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. డబ్ల్యూఈఎఫ్ ప్రెసిడెంట్ బోర్గే బ్రెండే బృందంతో సీఎం రేవంత్‌రెడ్డి చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. వరల్డ్ ఎకనమిక్ ఫోరం విశాల దృక్పథం, నిర్దేశించుకున్న లక్ష్యాలన్నీ తెలంగాణ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ఉన్నాయని చెప్పారు. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజలకు ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను వేగంగా అందుకోవచ్చు.
తెలంగాణను హెల్త్‌టెక్ హబ్‌గా, హెల్త్‌టెక్ రంగానికి ప్రపంచ గమ్యస్థానంగా మార్చడంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు కూడా హెల్త్‌టెక్ సేవలను అందించే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సెంటర్ ఫర్ హెల్త్ అండ్ హెల్త్‌కేర్ హెడ్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు డాక్టర్ శ్యామ్బిషెన్ మాట్లాడుతూ.. హెల్త్‌టెక్, లైఫ్సైన్సెస్రంగంలో నాయకత్వం వహించేందుకు అవసరమైన అర్హతలు భారతదేశానికి ఉన్నాయని, అందులో తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉన్నదని కొనియాడారు.
దావోస్ సదస్సులో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర ప్రతినిధి బృందంతో కలిసి పలు దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఐటీ, వైద్య, జీవశాస్త్ర రంగాలకు ము ఖ్య కేంద్రంగా అభివృద్ధి చెందిన తెలంగాణ బ లాలను ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారీ పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో తెలంగాణ ప్రతినిధి బృందం తొలి రోజునే పలువురు ప్రముఖులతో కీలక చర్చలు జరిపింది. సోమవారం వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతోపాటు నిర్వాహకులు, ఇతర ప్రముఖులతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఇథియోపియా డిప్యూటీ ప్రధాని డెమెక్ హసెంటోతో భేటీ అయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకు న్న రూట్‌మ్యాప్‌పై ఆయనతో చర్చించారు. అ నంతరం నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కాం) ప్రెసిడెంట్ దేబ్జానీఘోష్తో సమావేశమయ్యారు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్న యువతకు సిల్ డెవలప్మెంట్, ప్లేస్మెంట్ కమిట్మెం ట్, విలువైన ఉద్యోగాల కల్పనకు సాయం అం దించే అంశాలపై చర్చించారు. కాగా.. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘వేర్ ట్రెడిషన్ మీట్స్ ఇన్నోవేషన్’ అనే ట్యాగ్‌లైన్‌తో ఈ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు.
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (4ఐఆర్) నెట్వర్ ప్రపంచంలోని ఐదు ఖండాల్లో విస్తరించి ఉన్నది. హైదరాబాద్‌లో నెలకొల్పనున్న సీ4ఐఆర్ సెంటర్ ప్రపంచంలో 19వది. హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ నేపథ్యంతో ఏర్పాటవుతున్న మొదటి కేంద్రం కూడా ఇదే. ఈ సెంటర్ ఏర్పాటునకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే బీజం పడింది. అప్ప టి పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో హెల్త్‌కేర్, లైఫ్‌సైన్సెస్ రంగాల అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ప్రపంచంలోని ప్రఖ్యాత కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేందుకు బలమైన ఎకోసిస్టంను ఏర్పాటు చేశారు. దీంతో తెలంగాణ రాష్ట్రం ఆసియాలోనే లైఫ్‌సైన్సెస్ హాట్‌స్పాట్‌గా ఎదిగింది.
ముఖ్యంగా కేటీఆర్ వరుసగా దావోస్ సదస్సులకు హాజరవడంతోపాటు రాష్ట్రంలో ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా బయో ఏషియా సదస్సును నిర్వహిస్తూ రాష్ట్ర కీర్తిని ప్రపంచానికి చాటారు. ఫలితంగా గడచిన ఐదేండ్లలో ఒక్క లైఫ్ సైన్సెస్ రంగంలోనే తెలంగాణకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, సుమారు 1.30 లక్షల ఉద్యోగావకాశాలు వ చ్చాయి. 2017లో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా మెడికల్ డివైజెస్ పార్క్‌ను ఏర్పాటుచేసింది. ప్రస్తుతం ఇది దేశంలోనే అతిపెద్ద మెడ్‌టెక్ ఆర్అండ్డీగా అవతరించింది. ఆసియాలోనే అతిపెద్ద స్టెంట్ల తయారీ సంస్థ కూడా తెలంగాణలో ఏర్పాటైంది. రాష్ట్రంలో 50కిపైగా ఆర్అండ్డీ కంపెనీలు కొలువుదీరాయి. టీ-వర్క్స్ పేరుతో దేశంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్‌ను కేసీఆర్ ప్రభుత్వం నెలకొల్పింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాం లో నిర్వహించిన బయోఏషియా సదస్సులో బిల్‌గేట్స్, సత్య నాదెళ్ల, వాస్ నరసింహన్ వంటి అనేకమంది ప్రపంచ దిగ్గజాలు పాల్గొనడం విశేషం. లైఫ్‌సైన్సెస్ రంగంలో గత కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ నేపథ్యంలోనే సీ4ఐఆర్ ఏర్పాటు కోసం తెలంగాణలో అప్పట్లోనే బలమైన పునాదులు పడ్డాయి. సీ4ఐఆర్ స్వయం ప్రతిపత్తి కలిగిన, లాభాపేక్ష లేని సంస్థగా పేరొందింది.