రాజన్న సిరిసిల్ల : నేత కార్మికులు ఆందోళన బాట(Weavers protest) పట్టారు. కాంగ్రెస్ సర్కారు తప్పుడు విధానాల వల్లే మరమగ్గాల పరిశ్రమ తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోయిందని, ఆర్డర్లు ఇవ్వక, పెండింగ్ బకాయిలు చెల్లించక తమ ప్రాణాలు తీస్తుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఆర్డర్లు ఇచ్చి తమకు ఉపాధి కల్పించి చావులను నివారించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిరిసిల్లలోని(Siricilla) చేనేత జౌళిశాఖ కార్యాలయం ఎదుట(handloom textile office) ఏఐటీయూసీ చేనేత, పవర్లూం కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు, ఆసాములు పెద్ద సంఖ్యలో ధర్నా చేశారు.
ఈ సందర్భంగా లాల్బావుటా చేనేత, వపర్లూం కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పంతం రవి మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వల్ల కార్మికులు ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే వస్త్ర పరిశ్రమ పూర్తిగా మూతపడి, పరిశ్రమపై ఆధార పడ్డ వేలాది మంది రోడ్డున పడి కుటుంబాన్ని పోషించలేక మరిన్ని ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభాన్ని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలుమార్లు ప్రభుత్వ మంత్రులు, అధికారులను కలిసి మొరపెట్టుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు.
గత ప్రభుత్వం మరమగ్గాలకు ఇచ్చిన విద్యుత్ సబ్సిడీని యధావిధిగా కొనసాగించాలని, పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితిలో మరమగ్గాలపై ఉత్పత్తి చేస్తున్న వస్ర్తాలకు మార్కెట్ సౌకర్యం లేనందున ప్రభుత్వమే ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సమస్యలు, నేతన్నలకు ఉపాధి కల్పించే దిశగా ఆలోచించాలని, లేదంటే అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు, అధ్యక్షుడు ఆజ్ఞ వేణు, చిరాల లక్ష్మణ్, గాజుల లింగం, కొక్కుల రాజు, గాజుల సతీష్, కార్మికులు, ఆసాములు పాల్గొన్నారు.