Weather Update | హైదరాబాద్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు పడిపోయే సూచనలున్నాయని పేర్కొంది. ఆకాశం నిర్మలంగా ఉంటుందని చెప్పింది. డిసెంబర్ 19 వరకు తెలంగాణతో పాటు ఏపీలోనూ వర్షాలు కురిసే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
వారం రోజుల పాటు తుఫానులు ఏర్పడే పరిస్థితులు లేవని తెలిపింది. ఇటీవలే మిగ్జాం తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. మళ్లీ తుఫాన్ వచ్చే అవకాశాలు లేవని తుఫాన్ హెచ్చరికల విభాగం పేర్కొంది. ప్రస్తుతం మాల్దీవుల వద్ద ఉపరితల ఆవర్తనం ఉందని, దాంతో తెలుగు రాష్ట్రాలపై ఎలాంటి ప్రభావం ఉండదని తెలిపింది.