రాష్ట్రంలో పొడి వాతావరణం
హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు ఈ నెల 6 నుంచి తిరోగమించే పరిస్థితులు నెలకొనడంతో రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడింది. నాలుగు రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులు మాత్రమే కురుస్తున్నాయి. తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలోకి కిందిస్థాయి గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల రెండ్రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 17 జిల్లాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అత్యధికంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లెలో 3.75 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండపాకలో 1.73 సెం.మీ., హనుమకొండ జిల్లా ధర్మసాగర్లో 1.48 సెం.మీ., నాగర్కర్నూల్ జిల్లా లింగాలలో 1.35 సెం.మీ. వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 21.2 డిగ్రీల నుంచి 37.5 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదవుతున్నాయని పేర్కొన్నది.