హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వచ్చే మూడ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది.
ఆదివారం ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. గడిచిన 24 గంటల్లో కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసినట్టు వెల్లడించింది. శుక్రవారం ఆదిలాబాద్, నల్లగొండ జిల్లాల్లో 40 డిగ్రీలు, మిగిలిన జిల్లాల్లో 36.2 డిగ్రీల నుంచి 39.7 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని, దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టు వెల్లడించింది.