ఇల్లెందు, సెప్టెంబర్ 11: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వంద సీట్లు గెలుస్తామని, కేసీఆరే మళ్లీ సీఎం అవుతారని కొత్తగూడెం, ఇల్లెందు నియోజకవర్గాల ఎన్నికల ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం చేశారు. వచ్చే శాసనసభ ఎన్నికల కోసం ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చరిత్ర సృష్టించారని చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్జి హోదాలో సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందుకు వెళ్లిన ఆయనకు బీఆర్ఎస్ శ్రేణులు పాత బస్టాండ్ వద్ద ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా జరిగిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చొరవతో ఇల్లెందు నియోజకవర్గంలో రూ.1,600 కోట్లతో సంక్షేమం, అభివృద్ధి పనులు జరిగాయని చెప్పారు.
60 ఏండ్లుగా కలగా ఉన్న బస్సు డిపోను ఇటీవలే ప్రారంభించుకున్నామని తెలిపారు. 40 ఏండ్లుగా పోడు భూములకు పట్టాలివ్వాలని పోరాడుతున్న ఆదివాసీ, గిరిజనులకు పోడు పట్టాలు అందించామని గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తాతా మధు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటారని చెప్పారు. రెండు నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇల్లెందు ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.