రవీంద్రభారతి, ఆగస్టు 23: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకుంటామని ఓసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. ఓసీ జేఏసీ జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు ఆధ్వర్యంలో పలువురు నాయకులు సోమవారం హైదరాబాద్‌లో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును కలిశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. తమ జేఏసీ తరఫున నియోజకవర్గం లో విస్తృత ప్రచారం చేసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతిగా ఇస్తామన్నారు. హుజూరాబాద్‌లో ఇప్పటికే ఓసీ జేఏసీ జిల్లా, మండల కమిటీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్ర భుత్వం తీసుకున్న నిర్ణయ మేరకు ఈడబ్ల్యూఎస్ అర్హత నిబంధనలు అమలు జీవో, వయోపరిమితి నిబంధనల జీవోతోపాటు విద్య, ఉద్యోగాల్లో అన్ని విభాగాల్లో పూర్తిస్థాయిలో ఈడబ్ల్యూఎస్ 10 శాతం రిజర్వేషన్ల అమలుకు వెంటనే ఉత్తర్వులు అమలు చేసేలా చూడాలని వారు మంత్రిని కోరారు. ఇందుకు స్పందించిన హరీశ్‌రావు.. మూడు రోజుల్లో ఉత్తర్వుల వచ్చేలా చూస్తామని హామీ ఇచ్చా రు. రెడ్డి, వైశ్య కార్పొరేషన్లు, ఇతర ఓసీల సమస్యలు వెంటనే పరిష్కరిస్తామని ప్రభుత్వం తరఫున మంత్రి హామీ ఇచ్చినట్టు జేఏసీ నేతలు పేర్కొన్నారు. హరీశ్‌రావును కలిసిన వారిలో రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర సహ అధ్యక్షుడు బీ రాఘవరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా రెడ్డి సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు పీ రాంరెడ్డి, మూడ సాధవరెడ్డి, తిరుపతిరెడ్డి, గద్దె శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.