వికారాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని దామగుండం రిజర్వ్ ఫారెస్ట్‌లో వీఎల్ఎఫ్ రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఉద్యమం కదిలింది. నాలుగు నదులకు పుట్టినిల్లు అయిన దామగుండంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పాటు చేయొద్దని ప్రజాసంఘాలు, మేధావులు, పార్టీల నాయకులు, అధ్యాపకులు, ప్రకృతి ప్రేమికులు ముక్తకంఠంతో డిమాండ్ చేశారు.
తమ ప్రాంత భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యే రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా పార్టీలకతీతంగా పోరాడుదామని తీర్మానించారు. దామగుండంలో నేవీ రాడార్ ఏర్పాటుపై దామగుండం అడవి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ‘ప్రకృతి విధ్వంసం-పరిణామాల’పై ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ బాంక్వెట్ హాల్లో తొలి చర్చావేదిక జరిగింది. ఇందులో పలు తీర్మానాలు చేయడంతోపాటు భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు.
ఊరూరా పోరాటం
రాడార్ ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా వారం, పది రోజుల్లో సుప్రీంకోర్టుకు వెళ్తామని, అక్కడ న్యాయం జరుగకపోతే అంతర్జాతీయ కోర్టుకు.. ప్రకృతి విధ్వంసాన్ని ఆపాలని ఎన్జీటీ (జాతీయ హరిత ట్రిబ్యునల్)ను కూడా ఆశ్రయిస్తామని దామగుండం అడవి పరిరక్షణ సమితి నేతలు ప్రకటించారు. రాడార్ కేంద్రం చుట్టూ 7 కిలోమీటర్ల వరకు గ్రామాలను ఖాళీచేయాల్సి వస్తుంది.
30 కిలోమీటర్ల మేర రేడియేషన్ ప్రభావం ఉండనున్న దృష్ట్యా రాడార్ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఊరూరా ఉద్యమాన్ని ఉద్ధృతం చేయాలని నిర్ణయించారు. రేడియేషన్ వల్ల పుట్టుకతోనే క్యాన్సర్ రావడం, మతిభ్రమించడం, గాలి, నీరు కలుషితం కావడం, మనుషులు రోగాల బారిన పడటం వంటి దుష్పరిణామాలు కలుగుతాయని సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఊరూరా కరపత్రాలు పంపిణీ చేయాలని తీర్మానించారు.
ఒకరోజు వికారాబాద్ జిల్లా బంద్‌కు పిలుపునివ్వడంతోపాటు 5 వేల మంది విద్యార్థులతో మానవహారం, కలెక్టరేట్‌ను ముట్టడించి పాలనను స్తంభింపజేసి ప్రభుత్వానికి తెలిసేలా పోరాటం కొనసాగిస్తామని ప్రకటించారు. రాడార్ ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డితోపాటు అన్ని పార్టీలను కలవాలని, ప్రధాని మోదీకి వినతిపత్రం అందించాలని నిర్ణయించారు.
దామగుండం అటవీ ప్రాంతంలో 50-60 శాతం మేర చెట్లు లేవని, 0.4 శాతమే అటవీ విస్తీర్ణం ఉన్నదని పలు నివేదికలతో కోర్టును తప్పు దోవపట్టించారని.. ఆ మోసాలను బయటపెట్టి దామగుండం రిజర్వ్ ఫారెస్ట్ దట్టమైన అటవీ ప్రాంతమని, చాలా అరుదైన పక్షుజాతులతోపాటు కొండ గొర్రెల్లాంటి జంతువులున్నాయనేది కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఔషధ మొక్కలను నరకొద్దని రాజ్యాంగంలో ఉన్నదని, ప్రజాభిప్రాయం లేకుండా వికారాబాద్ ప్రజలు చచ్చినా బతికినా సంబంధం లేదని రాడార్ కేంద్రం ఏర్పాటు చేయడం సమంజసం కాదని, ఈ కేంద్రంతో నీరు, గాలి కలుషితమవుతాయన్న విషయాన్ని ప్రపంచ శాస్త్రవేత్తలందరూ గుర్తించారని పేర్కొన్నారు.
ప్రకృతి నాశనం ప్రమాదకరం
ప్రభుత్వం మారిన వెంటనే తెలంగాణ ప్రా ణవాయువైన, నదికి పుట్టినిల్లు అయిన వికారాబాద్ అడవులను అప్పనంగా అప్పజెప్పారని వక్తలు మండిపడ్డారు. ఈ అడవిలో లక్షల కోట్ల విలువైన ఔషధ మొక్కలున్నాయని, 258 రకాల పక్షిజాతులున్న దామగుండం అటవీ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని నొక్కి చెప్పారు. కేసీఆర్ ప్ర భుత్వ హయాంలో హరితహారం ద్వారా కోట్ల మొక్కలు నాటగా, ప్రస్తుత ప్రభుత్వం దట్టమైన అడవిని నాశనం చేయడం సరికాదని అ న్నారు.
దేశంలో దామగుండం ప్రాంతం ఒక్క టే ఎత్తైన ప్రదేశం కాదని, దేశంలో 360 అడుగుల ఎత్తైన ప్రదేశాలు 10-15 ఉన్నాయని తెలిపారు. బెంగళూరులోని కోలార్ గనుల ప్రాంతంలో గతంలో రాడార్ కేంద్రాన్ని ఏర్పా టు చేయాలని నిర్ణయించగా, అది ప్రైవేట్ ప్రాంతం కావడంతో దామగుండం అటవీ ప్రాంతాన్ని ఎంపిక చేశారని విమర్శించారు. నేవీ పాత టెక్నాలజీని వదిలేసి తక్కువ రేడియేషన్ ఉండే శాటిలైట్ ద్వారా సిగ్నల్ చేరవేసే రాడార్‌ను మరో ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సూచించారు.
చర్చావేదికలో బీఆర్ఎస్ నేత నాగేందర్‌గౌడ్, దామగుండం అడవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు మురళీధర్ దేశ్పాం డే, ప్రధాన కార్యదర్శి టీ రాజేందర్, ప్రకృతి ప్రేమికుడు సత్యానందస్వామి, ప్రొఫెసర్ అన్వ ర్, దేవనోనిగూడెం వెంకటయ్య, రిటైర్డ్ లెక్చరర్లు ముత్తారెడ్డి, నారాయణరావు, బీజేపీ ఉ పాధ్యక్షుడు మల్లేశ్పటేల్, తెలంగాణ ఉద్యమ వేదిక నాయకుడు రామన్న, హైకోర్టు న్యాయవాదులు మేకల శ్రీనివాస్, రాము, రిటైర్డ్ టీచర్ సాయన్న, సీపీఎం నాయకులు నర్సింగ్‌రావు, మహిపాల్, రాజలింగం, రాఘవేందర్ గౌడ్, సుజాత తదితరులు పాల్గొన్నారు.
రాడార్‌ను 12 రాష్ర్టాలు వ్యతిరేకించాయి
Muralidardeshpandy
నేవీ రాడార్ ఏర్పాటతో అడవిలోని ఔషధ మూలికలు, స్వచ్ఛమైన వాతావరణం, 150 నుంచి 200 రకాల జంతువులు, పక్షులు అంతరించిపోతాయి. ప్రభుత్వం వికారాబాద్ జిల్లాలోని అనంతగిరిని టూరిజం పేరుతో అభివృద్ధి చేస్తూనే, దామగుండం అడవిని నాశనం చేసేందుకు సిద్ధమైంది. సముద్ర మట్టానికి 360 మీటర్ల ఎత్తులో ఉండటంతో దామగుండం అడవిలో నేవీ రాడార్‌ను ఏర్పాటు చేయాలని 2010లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి.
ఇలాంటి స్థలాలు దేశంలో చాలా ఉన్నా.. ఇక్కడే ఏర్పాటు చేయడం సముచితం కాదు. రాడార్ ఏర్పాటును 12 రాష్ర్టాలు వ్యతిరేకించాయి. దామగుండం అడవిలో ఏర్పాటు చేస్తే 7 కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామాలను ఖాళీ చేయాల్సి వస్తుంది. 27 కిలోమీటర్ల మేర రహదారిని ఏర్పాటు చేస్తే ఈ ప్రదేశంలో మూసీ, కాగ్నా నదులతోపాటు మరో రెండు నదులు కలుస్తాయి. రేడియేషన్ ప్రభావంతో భూమి, గాలి, నీరు కలుషితమవుతుంది. జంతువులు, పక్షులు, ప్రజలు రేడియేషన్ ప్రభావానికి గురవుతారు.
– మురళీధర్ దేశ్‌పాండే, దామగుండం అడవి పరిరక్షణ సమితి అధ్యక్షుడు
ఐదువేల మందితో ఉద్యమం
దామగుండం అటవీ ప్రాంతంలో కొందరి స్వలాభం కోసం నేవీ రాడార్‌ను ఏర్పాటు చేస్తే రానున్న తరాల వారికి ముప్పు తప్పదు. ప్రజలు, జీవరాసులు, పక్షులకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోంచి సిగ్నల్స్ వెళ్లడంతో భూగర్భజలాలు సైతం కలుషితమవుతాయి. దామగుండం పర్యావరణ పరిరక్షణ కమిటీకి తోడుగా ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతా. 5 వేల మందితో కలెక్టరేట్‌ను ముట్టడించడంతోపాటు శాసనసభ స్పీకర్, ప్రధాని నరేంద్రమోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లకు సైతం వినతి పత్రాలను అందిస్తాం. రాడార్ ఏర్పాటుపై జరిగే లాభానష్టాలకు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తాం.
– బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగేందర్‌గౌడ్
దామగుండం అడవిని రక్షించుకుందాం
రాడార్ ఏర్పాటు కోసం దామగుండం అడవిలోని చెట్లను నరకొద్దని హైకోర్టులో కేసు నడుస్తున్నది. ప్రజలు, పర్యావరణం, జీవరాసులకు ముప్పు వాటిల్లే రాడార్ కేంద్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ దామగుండం పర్యావరణ పరిరక్షణ కమిటీ తరపున పోరాడుతున్నాం. కోర్టుకు కావాల్సిన సాక్ష్యాలను సేకరిస్తున్నాం. ప్రజలంతా ఏకతాటిపై ఉంటే రాడార్ ఏర్పాటును నిలిపేయొచ్చు. 2016లో రాడార్ కేంద్రాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహించిన సమావేశానికి 10 నుంచి 15 మంది మాత్రమే హాజరు కాగా.. ప్రస్తుత సమావేశానికి చాలామంది రావడం సంతోషకరం. 2010లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్‌ను నిలిపేందుకు హైకోర్టు, సుప్రీంకోర్టులకు సైతం వెళ్తాం. రాజకీయాలు, కుల మతాలకతీతంగా ప్రజలందరూ ముందుకు రావాలి.
-రామ్ చల్లా, హైకోర్టు న్యాయవాది
జీవరాశులకు హాని కలిగించొద్దు
దామగుండం అడవిలోని చెట్లను నరికి ప్రజలు, జీవరాశులకు హాని కలిగించొద్దు. రాడార్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తే ఈ ప్రాంతమంతా కలుషితమవుతుంది. 279 కిలోమీటర్ల మేర ఉన్న దట్టమైన అటవీ ప్రాంతాన్ని నాశనం చేయొద్దు. అడవిలోని చెట్లను నరికితే ఆ ప్రాంతంలో ఉన్న జీవరాసులు కనుమరుగవుతాయి. దామగుండం ప్రాంతంలో రాడార్ స్టేషన్ నిర్మాణాన్ని అడ్డుకోవాలి.
– సత్యానంద స్వామి, దామగుండం ప్రకృతి ప్రేమికులు
పర్యావరణాన్ని కాపాడుకోవాలి
పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే వృక్ష సంపదను పెంచుకోవాలి. దామగుండం అడవిలోని చెట్లను రాడార్ స్టేషన్ ఏర్పాటు పేరుతో నరికేస్తే ప్రజలు, జీవరాసులకు హాని కలుగుతుంది. అడవిలో ఔషధ మొక్కలు చాలా ఉన్నాయి. రాడార్‌తో భూమిపైన ఉన్న జీవాలు, భూమిలో ఉన్న పంటలు, చెట్లు, నదులు కూడా కలిషితమవుతాయి. ప్రజలు రేడియేషన్ బారినపడి.. అనేక రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నది.
– ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, హైదరాబాద్