KP Vivekananda | ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌ను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించడంలో స్పీకర్ విఫలమయ్యాడని విమర్శించారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటును తిరస్కరిస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించిన అనంతరం.. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి కేపీ వివేకానంద మాట్లాడారు. ఫిరాయింపులను అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బాహాటంగా సమర్థించుకున్నారని గుర్తుచేశారు. సీఎం సమర్థింపులకు అనుగుణంగా ఇవాళ స్పీకర్ తీర్పునిచ్చారని మండిపడ్డారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని కేపీ వివేకానంద అన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు బాహాటంగానే కాంగ్రెస్‌లో ఉన్నారని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారని చెప్పారు. కాంగ్రెస్ ఫ్లెక్సీలు, పోస్టర్లలో ఫిరాయించిన ఎమ్మెల్యేల ఫొటోలు ఉన్నాయని తెలిపారు. స్పీకర్ తీర్పుపై సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఐదుగురు ఫిరాయింపు ఎమ్మెల్యేలపైనే ఇవాళ తీర్పు ఇచ్చారని కేపీ వివేకానంద తెలిపారు. మిగతా ఐదుగురు ఎమ్మెల్యేలపై అడిగితే స్పీకర్ నుంచి సమాధానం లేదని అన్నారు. న్యూఇయర్ వేడుకలు ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోండి అని సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించడంతో స్పీకర్ ఈ తీర్పును వెలువరించారని అన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణను పొడిగిస్తే చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు హెచ్చరించిందని గుర్తుచేశారు. స్పీకర్ నోటీసులకు కడియం శ్రీహరి, దానం నాగేందర్ నుంచి ఎలాంటి జవాబు రాలేదని అన్నారు. కడియం శ్రీహరి, దానం నాగేందర్‌పై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
అసెంబ్లీ రూల్స్ బుక్ ప్రకారం జడ్జిమెంట్ కాపీ తమకు ఇవ్వాలని కేపీ వివేకానంద డిమాండ్ చేశారు. స్పీకర్ జడ్జిమెంట్ కాపీని వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామన్నారని తెలిపారు. కానీ జడ్జిమెంట్ తయారైందా లేదా అనే అనుమానం కలుగుతోందని అన్నారు. సుప్రీంకోర్టు గడువు రేపటితో ముగుస్తుందని తీర్పు ఇచ్చినట్లు ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో ఉన్నామంటున్నారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఆ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోనే ఉన్నారని చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ ముఖం పెట్టుకుని ప్రజల్లో తిరుగుతారని నిలదీశారు. మా పోరాటం ఫలితంగానే స్పీకర్ ఈ తీర్పు అయినా ఇచ్చారని అన్నారు. తెలంగాణ స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టులో పరువు తీస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.