హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ అద్దె బస్సుల యాజమానులతో ఇప్పటికే చేసుకున్న 10 సంవత్సరాల ఒప్పందం ప్రకారమే ప్రభుత్వం ముందుకెళ్తుందని, కొత్త అగ్రిమెంట్ సమయంలోనే కొత్త ప్రతిపాదనలను స్వీకరిస్తామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో అద్దెబస్సుల యజమానులతో మంత్రి సమావేశమయ్యారు. ప్రస్తుతం కిలోమీటర్‌కు ఇస్తున్న రూ.35కు అదనంగా మరో రూ.2 పెంచాలని, తమ బస్సులపై పడుతున్న భారాన్ని పరిష్కరించాలని అద్దెబస్సుల యజమానులు ఈ సందర్భంగా మంత్రిని కోరారు. దీంతో మంత్రి పైవిధంగా స్పందించారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై అద్దె బస్సుల యజమానులు సహకరించాలని కోరారు. కేఎంపీఎల్పై ఆర్టీసీ కమిటీలో చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఇతర సమస్యలపై నాలుగైదు రోజుల్లో సమావేశానికి పిలుస్తామని వారికి తెలిపారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా త్వరలో మరిన్ని కొత్త బస్సులు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సమావేశంలో అద్దెబస్సుల యజమానుల సంఘం అధ్యక్షుడు మధుకర్‌రెడ్డి, జనరల్ సెక్రటరీ మహిపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.