BJP | నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 25: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ పైనే ఎదురు తిరుగుతున్నారు. టికెట్ రానివారు సొంత పార్టీ అభ్యర్థులను ఓడించేందుకు సిద్ధపడుతున్నారు. బెల్లంపల్లి బీజేపీ అభ్యర్థి శ్రీదేవిని మార్చాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల హేమాజీ డిమాండ్ చేశారు.
బుధవారం కాసిపేట మండలం సోమగూడెంలో తన మద్దతుదారులతో కలిసి రాస్తారోకో చేశారు. నిర్మల్ జిల్లా ముథోల్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి పవార్ రామారావు పటేల్‌ను ఓడించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తానూర్ మండలంలోని కల్యాణి గ్రామంలో ఆమె కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని కోరారు. భవిష్యత్ కార్యాచరణపై కార్యకర్తలతో మాట్లాడి నిర్ణయిస్తానని ప్రకటించారు.
ఖానాపూర్ టికెట్ ఇవ్వకుండా బీజేపీ తనను మోసం చేసిందని పెంబి జడ్పీటీసీ భూ క్యా జానుబాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఖానాపూర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. గిరిజన మహిళకు పార్టీ ద్రోహం చేసిందని కంటతడి పెట్టారు. జగిత్యాల నియోజకవర్గ బీజేపీ టికెట్ తనకు ఎందుకు ఇవ్వలేదని ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముదుగంటి రవీందర్‌రెడ్డి అధిష్ఠానాన్ని ప్రశ్నించారు. జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. 12 ఏండ్లు గా బీజేపీ జెండాను మోసిన తనకు టికెట్ ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు.