యాదగిరిగుట్ట, జూలై 19: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మెడలు వంచి ఎస్సీ వర్గీకరణ సాధిస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ధీమా వ్యక్తంచేశారు. ఆగస్టు 9న చలో ఢిల్లీ కార్యక్రమానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మాదిగ, మాదిగ ఉపకులాల వారంతా తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం యాదగిరిగుట్టలోని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కూరెళ్ల రమేశ్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి ముఖ్య కార్యకర్తల సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా పాపయ్య మాదిగ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణే ఏకైక లక్ష్యంతో ఎమ్మార్పీఎస్ పనిచేస్తుందని స్పష్టంచేశారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో వర్గీకరణ చేసి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన బీజేపీ.. ఆ తర్వాత మోసం చేసిందని మండిపడ్డారు. అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర గౌ రవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల శ్రీనివాస్, మేధావుల ఫోరం నాయకులు డాక్టర్ రాజమౌళి, ప్రొఫెసర్ డాక్టర్ మల్లేశ్, రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిడెంట్ గెల్వయ్య, దాసి మోహన్, మంచాల యాదగిరి, బీ శంకర్ పాల్గొన్నారు.