హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): విధి నిర్వహణలో మృతి చెందిన ఇద్దరు సింగరేణి రెస్క్యూ టీం సభ్యుల కుటుంబాలకు, జర్నలిస్టు జమీర్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్వీట్ చేశారు. ఆసిఫాబాద్ జిల్లాలో వరదల్లో చిక్కుకున్న గర్భిణిని రక్షించే క్రమంలో సింగరేణి రెస్క్యూటీం సభ్యులు అంబాల రాము, చిలుకా సతీశ్ ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని పేర్కొన్నారు. అలాగే వార్తల సేకరణకు వెళ్లి వరదల్లో కొట్టుకుపోయి మరణించిన జర్నలిస్టు జమీర్ ఉదంతం అత్యంత బాధాకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతి తెలిపారు.