కోటపల్లి/చెన్నూర్, నవంబర్ 6: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెలుకలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఆసంపల్లి మహేశ్ కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ హామీనిచ్చారు. శనివారం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. తక్షణ సాయం కింద రూ.2 లక్షలు అందజేశారు. మహేశ్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగంతోపాటు ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూం ఇల్లు అందేలా చూస్తామని భరోసానిచ్చారు. మహేశ్ ఆత్మహత్య చేసుకున్న రోజే తక్షణ సాయంగా ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రూ.లక్ష అందజేశారు. కాగా, మరో రూ. 2 లక్షలను శనివారం అందజేశారు. అలాగే మండలంలోని వెల్మపల్లిలో ఇటీవల పిడుగుపాటుతో మృతి చెందిన ముక్కనవేణి కోటేశ్ కుటుంబాన్ని పరామర్శించి, రూ.50 వేల ఆర్థిక సాయం అందజేశారు. చెన్నూర్‌లోని జెండావాడకు చెందిన కమ్మల రాజేశ్ ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకోగా, బాధిత కుటుంబాన్ని బాల్క సుమన్ పరామర్శించి.. తక్షణ సాయం కింద రూ 2 లక్షలు అందజేశారు. బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తామని హామీనిచ్చారు.