హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 15(నమస్తే తెలంగాణ) : పేపర్ బాయ్స్, డిస్ట్రిబ్యూటర్ల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేయాలని రాష్ట్ర ప్రింట్ మీడియా డిస్ట్రిబ్యూటర్, పేపర్ బాయ్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. మౌలాలిలోని కలర్స్ ఫంక్షన్ హాల్స్‌లో బుధవారం రెండో రాష్ట్ర మహాసభ నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పేపర్ పంపిణీ ద్వారా 30 వేల మంది ఉపాధి పొందుతుండగా, చాలా మంది కనీస మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. 80శాతం సబ్సిడీతో ఈ-చార్జింగ్ మోటార్ సైకిళ్లను పంపిణీ చేయాలని, పత్రిక లోడింగ్, పంపిణీ కోసం రైతుబజార్ తరహా సేఫ్టీ షెడ్లను నిర్మించాలని తెలిపారు. కార్మికులకు రూ.10లక్షల ఆరోగ్య బీమా, రూ.20లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. రా ష్ట్ర అధ్యక్షుడు వనమాల సత్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంప్రసాద్‌రావు పాల్గొన్నారు.