హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని సచివాలయ ప్రాంగణంలో వందశాతం నిషేధించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. శుక్రవారం సచివాలయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించాలని నిర్ణయించి, 45 రోజులు గడిచిన సందర్భంగా ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ.. డిసెంబర్ 3 నాటికి పూర్తిస్థాయిలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత ప్రదేశంగా సచివాలయం మారనున్నదని తెలిపారు.
సచివాలయ ప్రాంగణంలో ప్రతిరోజూ 3 వేలకుపైగా సింగిల్ యూజ్ వాటర్ బాటిల్స్ వినియోగించే వారని, ఇప్పుడు పూర్తిగా తగ్గించినట్టు పేర్కొన్నారు. సచివాలయం ఆవరణలో స్వచ్ఛమైన మంచినీరు అందించేందుకు 32 ఆక్వాగార్డు వాటర్ డిస్పెన్సర్లను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ అన్నిశాఖల హెచ్వోడీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో స్టీల్, పింగాణి వస్తువులను వినియోగించాలని సూచించారు. సచివాలయం ప్రాంగణంలో గ్రీన్ కియోస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. సచివాలయ ప్రాంగణాన్ని జీరో వేస్ట్ క్యాంపస్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు కృషిచేయాలని సూచించారు. కేవలం ప్రభుత్వ ఉత్తర్వులతో ఇది సాధ్యం కాదని, స్వచ్ఛందంగా సామాజిక బాధ్యతతో పాటించాలని సూచించారు.