హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): బీసీ కులాల గణనను చేపట్టకుండా తాత్సారం చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ అన్ని కులాలు ఏకం కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశం పిలుపునిచ్చింది. దేశవ్యాప్తంగా తక్షణమే బీసీ కుల గణన చేపట్టకపోతే బీజేపీకి ఓట్లేయబోమని తీర్మానించింది. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాని కమలం పార్టీ మంత్రులను కాలనీల్లో తిరగనీయబోమని పేర్కొన్నది. బుధవారం హైదరాబాద్‌లోని సెంట్రల్‌కోర్టు హోటల్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం జరిగింది. సమావేశానికి బీజేపీ మినహా ఇతర అన్ని రాజకీయపార్టీల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి కోల జనార్దన్ అధ్యక్షత జరిగిన సమావేశంలో జాతీయ బీసీ సంక్షేమ సం ఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా బీసీలందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వచ్చే నెలలో కలెక్టరేట్ల వద్ద ధర్నాలతో ఉద్యమం మొదలుపెట్టి జాతీయస్థాయికి విస్తరింపజేస్తామని చెప్పారు. దేశంలో బీసీలు 70 కోట్ల మంది ఉన్నారని, వారి కి జనాభా దామాషా ప్రకారం నిధులు ఎందుకు కేటాయించడం లేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. 56% ఉన్న బీసీల అభ్యున్నతికి పాటుపడరా? అని నిలదీశారు. దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయని బీజేపీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఊరూరా ఉద్యమజెండాలు ఎత్తుతామన్నారు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌చేశారు.
బీసీలే అసలైన హిందువులు
లాభాల్లో నడిచే ఎల్ఐసీ, రైల్వేలు, బ్యాంకు లు, పోర్టులను అమ్మడం ద్వారా రాజ్యాంగబద్ధంగా సాధించుకున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీవర్గాల రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నదని ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. అన్ని వాదాలను, నినాదాలను పక్కనపెట్టి ఆ పార్టీ హిందూవాదమే జీవననాదంగా బతుకుతున్నదని మండిపడ్డారు. అసలైన హిందువులు బీసీలేనన్న సత్యాన్ని గుర్తించాలని హితవు పలికారు.
బండీ.. ఢిల్లీ యాత్ర చెయ్: వీహెచ్
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీకి యాత్ర చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హన్మంతరావు హితవు పలికారు. అన్ని ప్రభుత్వరంగ సంస్థలను అమ్మకానికి పెడుతూ, రాజ్యాంగబద్ధంగా సాధించుకున్న రిజర్వేషన్లను బీజేపీ ఎత్తగొడుతున్నదని మండిపడ్డారు. ఆదరణ లేకపోవడంతో ఇప్పటికే అనేక బీసీ కులాలు తమ వృత్తులను కోల్పోయాయని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. హక్కుల సాధన కోసం అలుపెరుగని పోరాటాల కు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అట్టడుగున ఉన్న బీసీవర్గాలను అభివృద్ధి చేయాలంటే కులాలవారీ గణన ఉంటేనే సాధ్యమవుతుందన్నారు.
హక్కుల సాధనకు పోరాటాలు: ఎల్ రమణ
బీసీల హక్కుల సాధనకు జాతీయ బీసీ సం క్షేమ సంఘం చేపట్టే ఎలాంటి పోరాటానికైనా సంపూర్ణ మద్దతు ఇస్తామని టీఆర్ఎస్ నేత, మా జీ మంత్రి ఎల్ రమణ తెలిపారు. బీసీల గణన చేపట్టాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని చె ప్పారు. లెక్కలు తీస్తేనే బీసీల జీవన స్థితిగతులు తెలుస్తాయని, గణన చేపట్టకపోతే ఏ లెక్కన వారి సమస్యలు పరిష్కరిస్తారని ప్రశ్నించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీని నిలబెట్టుకోవాలి: బాలమల్లేశ్
బీసీ కులగణన చేపడతామని ప్రధాని మోదీ 2019లో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని సీపీఐ రాష్ర్ట కార్యదర్శివర్గ సభ్యుడు బాలమల్లేశ్ డిమాండ్ చేశారు. బీసీ కులగణనకు తాము సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు. బీసీ కులాల గణన చేయాలని ఇప్పటికే అనేక రాష్ర్టాలు అయా అసెంబ్లీల్లో తీర్మానాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ కుల గణన చేయాలని జాతీయ బీసీ కమిషన్ ముందు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపిన విద్యార్థులపై బీజేపీ నాయకులు దాడి చేయించారని టీఆర్ఎస్ నేత రాజారాం యాదవ్ విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న బీసీ వ్యతిరేక వైఖరిని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. అణగారిన వర్గాలను అణచివేయటమే బీజేపీ ఎజెండాగా మారిందని బీఎస్సీ నేత ప్రభాకర్ విమర్శించారు. సమాజంలో బీసీల స్థితిగతులు తెలియాలంటే బీసీకులాల గణన చేయాల్సిందేనని ప్రొఫెసర్ కోదండరాం అభిప్రాయపడ్డారు. సమావేశంలో మాజీ ఎంపీలు అజీజ్‌ఖాన్, మల్లు రవి, పలు బీసీ, వృత్తి సంఘాల నాయకులు హరికిషన్, ఆంజనేయులు, దాసు సురేశ్, చిరంజీవి తదితరులు పాల్గొని బీసీ కులాల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. లెక్కలు తేల్చేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని ప్రతినబూనారు.