హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబరు 4 (నమస్తే తెలంగాణ) : ‘సమాజంలో జరుగుతున్న అక్రమాలను వెలికితీయడం మీడియా బాధ్యత. అనేక సందర్భాల్లో ఇలాంటి వార్తా కథనాలు పత్రికల్లో ప్రచురితమవుతుంటాయి. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ ప్రాంతంలో కొందరు వ్యక్తులు ల్యాండ్ పూలింగ్ పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆధారాలతో సహా నమస్తే తెలంగాణ దినపత్రిక వార్త కథనాలను ప్రచురిస్తే కొందరు ప్రైవేట్ వ్యక్తులతో ఆ పత్రికపై కేసు పెట్టించడాన్ని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండిస్తున్నది. కొందరు వ్యక్తులు తమ స్వార్థం కోసం స్థానికులను పావుగా వాడుకొని పత్రికపై కేసులు పెట్టించే కొత్త పద్ధతికి తెరతీస్తున్నారు..ఇది ఎంత మాత్రం మంచిది కాదు’ అని టీయూడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, అస్కాని మారుతీ సాగర్ సోమవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. పత్రికల్లో ఏదైనా వార్తా కథనాలు ప్రచురిస్తే దానికి ఖండన గాని, వివరణ గాని ఇవ్వొచ్చు అని, అలాకాకుండా కేసులు పెట్టించడం, భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నమేనని అల్లం నారాయణ స్పష్టంచేశారు.
గొంతునొక్కే ప్రయత్నం మంచిదికాదు : విష్ణువర్ధన్‌రెడ్డి
మీడియాపై కేసులు పెట్టి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం ఎంత మాత్రం సబబు కాదని తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టు యూనియన్ (టీఈఎంజేయూ/టెమ్జూ) అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏ రమణ కుమార్ మండిపడ్డారు. ఇది ముమ్మాటికీ మీడియాను అణచివేసే చర్యగా తాము భావిస్తున్నామని, వెంటనే కేసులను ఉపసంహరించుకునేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పోలీసుల తీరు మార్చుకోవాలి : ఉప్పరి శేఖర్ సాగర్
అక్రమాలను వెలికితీస్తున్న నమస్తే తెలంగాణ దినపత్రికపై పోలీసులు కేసు నమోదు చేయడాన్ని ఖండిస్తున్నామని, ఈ ప్రజా పాలనలో భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం ఎంత వరకు సమంజసమని టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ ప్రశ్నించారు. ప్రభుత్వం, పోలీసులు తీరు మార్చుకోవాలని, లేదంటే సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.