హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ఐఐటీల్లో చేరాలన్నది చాలామంది విద్యార్థుల కల. అక్కడి బోధనా విధానం.. విద్యార్థులను తీర్చిదిద్దే తత్వం.. పరిశోధనలు ఐఐటీలకు ఆ ఖ్యాతిని తెచ్చిపెట్టాయి. అయితే, కొంతమంది విద్యార్థులకే ఐఐటీల్లో చేరే అవకాశం కలుగుతుంది. కానీ, ఇప్పుడు సామాన్య విద్యార్థులు కూడా ఐఐటీ ప్రొఫెసర్ల పాఠాలు వినే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఫీజు చెల్లించకుండా, విద్యార్హతల ఊసేలేకుండా 500 పైగా కోర్సులపై వీడియో పాఠాలు వినొచ్చు. ఇలాంటి అద్భుత అవకాశాన్ని నేషనల్ ప్రోగ్రాం ఆన్ టెక్నాలజీ ఎన్హ్యాన్స్డ్ లర్నింగ్ (ఎన్పీటీఈఎల్) కల్పిస్తున్నది. ఒక్క క్లిక్‌తో కోర్సులను పూర్తిచేయడం, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవడమే కాకుండా అఖరులో సర్టిఫికెట్‌ను కూడా పొందవచ్చు. ఏడు ఐఐటీలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ – బెంగళూరు ప్రొఫెసర్లు డిజిటల్ పాఠాలను బోధిస్తారు.
సబ్జెక్టులివే..
ఇంజినీరింగ్, ఇంగ్లిష్, గణితం, మేనేజ్మెంట్, ఫిజిక్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, హ్యూమానిటీస్, సోషల్ సైన్సెస్ వంటి సబ్జెక్టులపై వీడియో పాఠాలు రూపొందించారు. ఇంజినీరింగ్‌లో కంప్యూటర్‌సైన్స్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటలర్జీ, ఏరోస్పేస్, ఆర్కిటెక్చర్ తదితర బ్రాంచిలకు సంబంధించిన కోర్సులున్నాయి. కోర్సుల వ్యవధి 4, 8, 12 వారాలు మాత్రమే ఉంటుంది. కోర్సును బట్టి వారానికి నాలుగు గంటల పాటు వీడియో పాఠాలు అందుబాటులో ఉంటాయి.
మరికొన్ని ప్రత్యేకతలు..
ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా బిహేవియర్ స్కిల్స్‌ను ఆశించే వారు సాఫ్ట్‌స్కిల్ డెవలప్మెంట్ కోర్సులో చేరొచ్చు.
కంప్యూటర్ సైన్స్‌లో బేసిక్ కోర్సులతోపాటు, అడ్వాన్స్డ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్, గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్న వారు వీటిని సద్వినియోగం చేసుకోవచ్చు.