Harish Rao | ప్రజలు, పార్లమెంటును సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని హరీశ్‌రావు ఆరోపించారు. ముఖ్యమంత్రి, మున్సిపల్ మంత్రి రేవంత్ రెడ్డే అని తెలిపారు. సంబంధిత శాఖ మంత్రి సంతకంతోనే పార్లమెంటుకు సమాధానం వెళ్తుందని పేర్కొన్నారు. అంటే ఆయనకు తెలిసి కూడా కేంద్రానికి తప్పుడు సమాచారం అందించారని మండిపడ్డారు. కొత్తగా ఇండ్లను కూల్చబోమని అంటున్నారని.. మరి కూల్చిన వాటి సంగతేంటని ప్రశ్నించారు. వాళ్లు అనుభవించిన క్షోభ సంగతి ఏంటని నిలదీశారు.
హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూల్చారని హరీశ్‌రావు తెలిపారు. చిన్న పాప పుస్తకాలు తెచ్చుకుంటా అంటే ఊరుకోకుండా.. ఇండ్లు కూల్చేశారని.. దీనికి ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. పరిహారం ఇచ్చినా సరే వారు పడిన బాధ పోదని అన్నారు. కట్టుబట్టలతో ఇండ్ల నుంచి బయటకు గెంటేశారని.. మూసీ విషయంలోనూ అదే పరిస్థితి నెలకొందన్నారు. కూలిన ఇండ్లకు నష్టపరిహారం ఎలా చెల్లిస్తావని ప్రశ్నించారు. దుందుడుకు చర్యలతో పేదల ఉసురు తీసుకుంటున్నావని సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. రాష్ట్రం పరువు తీస్తున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం ఇచ్చేవరకు ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ వదిలిపెట్టదని స్పష్టం చేశారు.
280 కుటుంబాల ఇండ్లను కూల్చేసినమని అంటున్నారని హరీశ్‌రావు తెలిపారు. ఓల్డ్ మలక్‌పేట శంకర్‌నగర్‌లో ఒక ఇంట్లో 16 కుటుంబాలు ఉంటున్నాయని తెలిపారు. ఆ ఇల్లు కూల్చేసి, కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూం ఇల్లు ఇస్తే వాళ్లు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మానవత్వంతో ఇండ్లు ఇస్తున్నామని పార్లమెంటుకు చెప్పారని.. మానవత్వంతో కాదు.. హక్కుగా ఇవ్వాలని చెప్పారు. ఇల్లు పొందడం నిర్వాసితుల రాజ్యాంగ హక్కు అని స్పష్టం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి గతంలో సోనియా గాంధీని బలి దేవత అన్నాడని.. ఇప్పుడు తల్లి అంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. నిజంగా ఆమె మీద గౌరవం ఉంటే సోనియా గాంధీ తెచ్చిన భూసేకరణ చట్టం 2013ను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మూసీ బాధితులకు పరిహారం విషయంలో పార్లమెంటుకు చెప్పిన అంశాలపై చర్చించేందుకు సిద్ధమని తెలిపారు. ఎక్కడికి రావాలో ముఖ్యమంత్రి చెప్పాలని సవాలు విసిరారు.
బుల్డోజర్ ఎక్కించి చంపుతా, తొక్కుతా అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం కాదని హరీశ్‌రావు అన్నారు. దీనికి ఎక్కడికి రావాలన్నా సిద్ధమేనని బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. టీవీ చానల్‌కు వెళ్దామా.. సచివాలయానికి రావాలా అని అడిగారు. అఖిలపక్ష సమావేశం పెట్టాలని కేటీఆర్ చెప్పారని.. తాను కూడా చెప్పానని గుర్తుచేశారు. అఖిలపక్ష సమావేశం ఎందుకు పెట్టలేదని నిలదీశారు. పార్లమెంటును తప్పుదోవ పట్టిస్తున్నావని.. సోనియాగాంధీని తప్పుదోవ పట్టిస్తున్నావని రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు.
మూసీ పునరుజ్జీవానికి తాము వ్యతిరేకం కాదని హరీశ్‌రావు తెలిపారు. మూసీ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. మూసీ ముసుగులో రాష్ట్ర ప్రభుత్వ నిధులు కొల్లగొట్టడానికి వ్యతిరేకమని చెప్పారు. మూసీ ప్రాజెక్టు ప్రారంభించిందే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. అవాసత్వాలు చెప్పడం మీద పార్లమెంటులో ప్రివిలేజ్ మోషన్ ఇస్తామని చెప్పారు. మూసీ పేదల పక్షాన న్యాయస్థానాలకు వెళ్తామని అన్నారు. చట్టం ప్రకారం ఆ పేదలకు సాయం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. మూసీ పేదల పక్షాన అసెంబ్లీలో కూడా పోరాడతామని స్పష్టం చేశారు. మూసీ బాధితులకు పూర్తిగా అండగా ఉంటామని.. పోరాటం చేస్తామని తెలిపారు.