జయశంకర్ భూపాలపల్లి : ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ రంగానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల రాష్ట్రం విద్యుత్ కొరత నుంచి మిగులుకు చేరుకోబోతుందని టీఎస్ జెన్కో, ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ దేవులపల్లి ప్రభాకర్‌రావు (Genco Chairman Prabhakar Rao)పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో రూ కోటి వ్యయంతో నూతనంగా నిర్మించిన పర్యవేక్షక ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ (విద్యుత్ ప్రగతి భవన్) భవనాన్ని మంగళవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడే నాటికి కరెంట్ వినియోగం సగటున 1136 యూనిట్లు కాగా నేడు 2140 యూనిట్లకు చేరుకుందని వివరించారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతాంగం(Farmers) అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు. పగలుమూడు గంటలు, రాత్రి మూడు గంటల కరెంట్ వల్ల రైతులు పొలాలవద్దే పడుకునేవారని , పాము, తేళ్ల కాటుకు, కరెంటు ప్రమాదాలకు లోనయ్యేవారని వివరించారు.
అప్పటి పరిస్థితి నేడు లేదని, అందరికీ నాణ్యమైన విద్యుత్(Quality Power)ను అందిస్తున్నామని పేర్కొన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్(Cheif Minister KCR) ఆదేశాలతో హైదరాబాద్‌లో అందిస్తున్న మాదిరిగా నాణ్యమైన విద్యుత్‌ను మారుమూల ప్రాంతాలకు కూడా ఇస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి కరెంట్ జనరేషన్, డిస్ట్రిబూషన్, ట్రాన్స్మిషన్లపై రూ. 97,500 కోట్లు పెట్టుబడి పెట్టిందని తెలిపారు. ట్రాన్స్మిషన్(Transmission), డిస్ట్రిబూషన్ (Distribution)నెట్వర్క్ కోసం 40 వేల కోట్లు వెచ్చించడడం వల్ల నాణ్యమైన విద్యుత్‌ను అందించగలుగుతున్నామని పేర్కొన్నారు.
భూపాలపల్లి సెకండ్ స్టేజ్ కింద 600 మెగావాట్ల ప్రాజెక్టును చేపట్టి ఏడాదిలోపు పూర్తి చేసి సీఎం కేసీఆర్ జాతికి అంకితం చేశారని గుర్తు చేశారు. రాష్ట్రం వచ్చేనాటికి 7778 మెగావాట్ల కెపాసిట్ ఉండగా నేడు 18,565 మెగావాట్ల కెపాసిట్ వరకు పెంచామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram)కు అవసరమయ్యే విద్యుత్ ఇచ్చే స్థితిలో ఉన్నామని తెలిపారు. వీటితో పాటు పాలమూరు,రంగారెడ్డి ఎత్తిపోతలకు అవసరమయ్యే 6500 మెగావాట్ల విద్యుత్ అవసరముంటుందని వివరించారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ దూరదృష్టితో మిర్యాల గూడ దామరచర్ల వద్ద 4వేల మెగావాట్ల సామర్ధ్యం గల విద్యుత్ ఉత్పత్తికి రూ. 34 వేల కోట్లతో చేపట్టామని త్వరలో దాన్నికూడ ప్రారంభించబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎన్పీడీసీఎల్ సీఎండి అన్నమనేని గోపాల్ రావు, జెన్కో,ట్రాన్స్‌కో డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం కార్యాలయ ఆవరణలో సీఎండీ మొక్కను నాటారు .