హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ): ఏపీ సర్కారు చేపట్టిన పోలవరం బనకచర్ల (Banakacherla) లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో ఎకనామికల్ అప్రయిజల్ ప్రక్రియ ఆగబోదని కేంద్ర జల్‌శక్తిశాఖ చెప్పకనే చెప్పింది. తెలంగాణతోపాటు గోదావరి బేసిన్ రాష్ర్టాలు లేవనెత్తిన అంశాలను పరిగణలోకి తీసుకుని, సంప్రదింపులతోనే ముందుకు వెళ్తామని వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ 20 రోజుల క్రితం స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. కానీ సర్కారు మాత్రం ఈ అంశాన్ని ఇప్పటికీ బయటకు పొక్కకుండా చూడటం గమనార్హం. అవార్డుకు విరుద్ధంగా గోదావరి నుంచి 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేందుకు రూ.81 వేల కోట్ల అంచనా వ్యయంతో పోలవరం- బనకచర్ల లింక్ ప్రాజెక్టును (పీబీ) చేపట్టేందుకు ఏపీ ప్రణాళికలను రూపొందించిన విషయం తెలిసిందే. ఆ పీబీ లింక్ ప్రాజెక్టుకు సంబంధించి పీఎఫ్ఆర్ (ప్రీ ఫీజుబిలిటీ రిపోర్టు)ను గతంలోనే కేంద్ర జల్‌శక్తిశాఖకు సమర్పించింది. తెలంగాణవ్యాప్తంగా ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వెల్లువెత్తడం, బీఆర్ఎస్ ఒత్తిడితో ఎట్టకేలకు రేవంత్‌రెడ్డి స్పందించారు.
పీబీ లింక్ ప్రాజెక్టుపై అభ్యంతరాలు తెలుపుతూ కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రికి గత జూలైలో లేఖ రాశారు. తాజాగా తెలంగాణ సీఎం లేఖపై కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పందించారు. రేవంత్‌రెడ్డి లేఖకు బదులిస్తూ సెప్టెంబర్ 23న లేఖ రాశారు. ఏపీ సమర్పించిన పీబీ లింక్ ప్రాజెక్టు పీఎఫ్ఆర్ను ప్రస్తుతం కేంద్రజల్‌శక్తి శాఖ పరిధిలోని కేంద్ర జల కమిషన్ (సీడబ్ల్యూసీ) పరిశీలిస్తున్నదని వెల్లడించారు. ఆ పీఎఫ్ఆర్ను అన్ని కో-బేసిన్ రాష్ట్రాలకు పంపామని తెలిపారు. సంబంధిత అధికారులు, కో-బేసిన్ రాష్ట్రాలతో సంప్రదించి ప్రాజెక్ట్ సాంకేతిక-ఆర్థిక అంచనా కోసం తగిన ప్రక్రియను అనుసరిస్తామని సైతం ఆ లేఖలో కేంద్ర మంత్రి తెలిపారు. దానిని తోసి పుచ్చకుండా పీఎఫ్ఆర్ను పరిశీలిస్తున్నామని కేంద్రజల్‌శక్తి శాఖ వెల్లడించడం గమనార్హం. ఇదిలాఉంటే కేంద్రం నుంచి లేఖ వచ్చి దా దాపు 20 రోజులు గడిచినా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయం పొక్కకుం డా దాచిపెట్టడం చర్చనీయాంశంగా మారింది.