ఒక సమస్య పుట్టింది..పరిష్కార ఆలోచన మెరిసింది..అది స్టార్టప్‌గా అవతరించింది..ఇంకో సమస్య వచ్చి పడింది..సరికొత్త ఆలోచన తట్టింది..మరో కొత్త ఆవిష్కరణ వెలిసింది..ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు..వేల సమస్యలకు పరిష్కారాలు..తగ్గట్టే స్టార్టప్‌ల ప్రారంభాలు..తెలంగాణ టీహబ్ అండగా!ప్రపంచానికి వెలుగులు నిండుగా!!
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): అత్యుత్తమ ఆవిష్కరణలకు హద్దు, సరిహద్దు ఉండదు. యావత్తు ప్రపంచమే మార్కెట్. ఇదే లక్ష్యంతో ఏర్పాటవుతున్న స్టార్టప్‌లను అడుగడుగునా ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్నది టీహబ్. తెలంగాణ ఏర్పాటయ్యాక ప్రారంభించిన టీ హబ్‌తో వేల స్టార్టప్‌లు ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తూ, విశ్వవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రణాళికలు రచించుకొంటున్నాయి. అందుకు ప్రత్యేక ఉదాహరణే.. టీహబ్‌కు చెందిన 13 స్టార్టప్‌లకు అంతర్జాతీయ గుర్తింపు. ఇటీవల హైదరాబాద్ కేంద్రంగా జరిగిన టై గ్లోబల్ సమ్మిట్-100 ఎమర్జింగ్ స్టార్టప్‌ల జాబితాలో 14 దేశాల్లోని 80 నగరాల నుంచి 1,000కి పైగా స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు వచ్చాయి. అందులో 68 ఎమర్జింగ్ స్టార్టప్‌లుగా ఎంపికవగా, టీ హబ్‌కు చెందినవే 13 స్టార్టప్‌లు ఉండటం గమనార్హం. టీ హబ్ ప్రోత్సాహంతో ఔత్సాహిక స్టార్టప్ వ్యవస్థాపకులు తమ సత్తా చాటుతున్నారు. దేశంలోనే స్టార్టప్ క్యాపిటల్‌గా మారిన తెలంగాణ.. సరికొత్త ఆవిష్కరణలతో ప్రపంచంపై ప్రభావం చూపిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం జాతీయ స్టార్టప్ డేను జనవరి 16న నిర్వహిస్తున్నది.
ఎంపిక చేసిన రంగాలు
స్టార్టప్‌లు అంటే కేవలం టెక్నాలజీ విభాగంలోనే కాకుండా వివిధ రంగాల్లో స్టార్టప్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అన్ని రంగాల్లో పని చేస్తున్న స్టార్టప్‌లకు ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ఉంటుందని, వాటికి గుర్తింపు దక్కేలా ఈ జాబితాను తయారు చేసి ఎంపిక చేశారు. వీటిలో అగ్రిటెక్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఎడ్టెక్, ఫిన్‌టెక్, ఇన్సూర్టెక్, రెగ్‌టెక్, వెబ్3.0, గేమింగ్, మెటావర్స్, డిజిటైజేషన్, హైపర్ లోకల్, ఈ-కామర్స్, హెల్త్ అండ్ లైఫ్ సైన్సెన్, ట్రావెల్, యానిమేషన్, మీడియా, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్‌లు ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆయా స్టార్టప్‌లు తమ కార్యకలాపాలను విస్తరించేందుకు అవకాశం ఉంది. వారు ఎంపిక చేసుకున్న రంగం లో ఉన్న మార్కెట్ వాటాను అంచనా వేస్తూ రూపొందించిన జాబితా ఆధారంగా స్టార్టప్ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు టీహబ్‌లోని ఎకో సిస్టం తోడ్పడుతోంది. దీనికి ఉదాహరణ.. ఇటీవల కాలంలో అంతరిక్ష రంగంలో రెండు స్టార్టప్‌లు స్కైరూట్ ఏరోస్పేస్, ధ్రువ స్పేస్‌లు దేశంలోనే మొట్ట మొదటిసారిగా చిన్న స్థాయి రాకెట్లను, శాటిలైట్లను తయారు చేసి అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించాయి. ఇలా ప్రతి రంగంలోనూ స్టార్టప్‌లు తమ విజయ బావుటాను ఎగరవేస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి.
స్టార్టప్‌లకు నిరంతర ప్రోత్సాహం
స్టార్టప్‌లను స్థాపించింది మొదలుకొని, దానికి నిధులు సాధించే వరకు సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. చక్కని ఆలోచనలతో ప్రారంభించిన స్టార్టప్‌లను విజయవంతంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం వ్యాపార ప్రణాళికలను సమర్థంగా రూపొందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పెట్టుబడిదారులకు తమ స్టార్టప్ చేసే కార్యకలాపాలు, లక్ష్యం, మార్కెటింగ్ పరిధిని అర్థమయ్యేలా మౌఖికంగా, బిజినెస్ నమూనాలో చెప్పగలిగేలా సిద్ధమై ఉండాలి. ఇలా ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్న స్టార్టప్‌లను అన్ని విధాలుగా ప్రోత్సహించేందుకు టీ హబ్ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది.
పెంపుడు జంతువుల కోసం – పెట్ఫోక్
పెంపుడు జంతువుల కోసం పెట్ఫోక్ స్టార్టప్ ప్రారంభమైంది. పెంపుడు జంతువుల సంరక్షణ, ఆహారం విషయంలో యజమానులు ఇబ్బందులు పడుతుండటాన్ని గుర్తించిన లక్ష్మీకాంత్ పుదుచ్చేరి ఒక మొబైల్ యాప్ ప్రారంభించాడు. పెంపుడు జంతువులకు సంబంధించిన అన్ని సేవలు అందించేలా యాప్‌ను తీసుకొచ్చాడు. దేశ వ్యాప్తంగా 40 నగరాల్లో 400 వరకు మొబైల్ వ్యాన్లను ఏర్పాటు చేసి సేవలందించే లక్ష్యంతో ఉన్నాడు. పెట్ఫోక్ స్టార్టప్ మొబైల్ యాప్‌ను ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆవిష్కరించారు.
వ్యాపారాల్లో బహుళ అవసరాలు – అవుట్ ప్లే స్టార్టప్
వ్యాపార సంస్థల్లో విక్రయాలకు సంబంధించిన బహుళ అవసరాలను టెక్నాలజీ ద్వారా తీర్చుకొనేలా సరికొత్త టూల్‌ను ఇద్దరు ఐటీ నిఫుణులు రామ్, లక్ష్మణ్ పాపినేని రూపొందించారు. టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఈ స్టార్టప్.. కంపెనీల అవసరాలకు అనుగుణంగా సాప్ట్వేర్ టూల్స్‌ను రూపొందించి ఇస్తుంది. ఇందులో ప్రధానంగా మల్టీ చానల్ అవుట్ రీచ్, అవుట్ బౌండ్ సేల్స్, ఆటోమేషన్, ప్రాస్పెక్ట్ ట్రాకింగ్, లీడ్ సోర్సింగ్ మార్కెట్, మీటింగ్ షెడ్యూలర్ వంటివి ఉన్నాయి. దేశ, విదేశీ కంపెనీలతో వ్యాపార సంబంధాలు కొనసాగించేందుకు టీహబ్ అనుకూల వాతావరణం కల్పిస్తున్నదని వీరు చెప్తున్నారు.
సరైన ఉద్యోగానికి.. – పర్స్పెక్ట్ ఏఐ
ప్రస్తుతం ఏ ఉద్యోగానికి ఎవరు అర్హులో గుర్తించడం అంత సులభం కాదు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో ఇది సాధ్యమని నిరూపించారు పర్స్పెక్ట్ ఏఐ స్టార్టప్ వ్యవస్థాపకులు. వ్యక్తులు, ఉద్యోగాల మధ్య కచ్చితమైన పోలికను కనిపెట్టడమే లక్ష్యంగా పర్స్పెక్ట్ ఏఐ స్టార్టప్‌ను ప్రారంభి విజయవంతంగా సేవలు నిర్వహిస్తున్నారు. సరికొత్త ఆలోచన ఉంటే చాలు అక్కున చేర్చుకొని ఆర్థిక అండదండలు అందించేందుకు టీహబ్ ఉన్నది. టీ ఫండ్ ద్వారా ఈ స్టార్టప్‌కు రూ.కోటి వరకు నిధులు అందాయి. ‘రెజ్యూమ్‌లు, ఇంటర్వ్యూల మీద ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఏఐతో కొత్తగా టూల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వెల్లడించారు.
ఫిజియోథెరపీకి.. – స్టార్టూన్ ల్యాబ్
ఐఐటీ మద్రాస్‌లో మాస్టర్స్, ఐఐఎం అహ్మదాబాద్, కోల్‌కతాలో స్పెషలైజేషన్ కోర్సులు చేసిన సురేశ్, మైత్రేయి ఫిజియోథెరపీ కోసం ఒక పరికరాన్ని తయారు చేశారు. స్టార్టూన్ ల్యాబ్ అనే స్టార్టప్‌ను ప్రారంభించి, ఫిజీ అనే ఉపకరణాన్ని రూపొందించారు. ఫిజియోథెరపీ చేశాక రోగి సమస్య ఏ మేరకు తగ్గిందనేది తెలుసుకొనేందుకు దీన్ని తయారుచేశారు. టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ స్టార్టప్‌కు నిధులు పుష్కలంగా సమకూరుతున్నాయి. మెడిటెక్ స్టార్టప్ అయిన స్టార్టూన్ ల్యాబ్‌లో ఇండియన్ ఏంజిల్ నెట్వర్క్ రూ.10.5 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ స్టార్టప్ ఆవిష్కరిస్తున్న ఉత్పత్తులకు మంచి భవిష్యత్తు ఉండటంతో పలు కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి.
టీ హబ్‌లోని స్టార్టప్‌లు:
వర్చువల్ రియాలిటీతో వినూత్న ప్రాజెక్టులు – ఇమాజినేట్ స్టార్టప్
కల్పిత ప్రపంచమే వర్చువల్ రియాలిటీ. భౌతికంగా సాధ్యం కాని దాన్ని సైతం సృష్టిస్తున్నదీ టెక్నాలజీ. ఈ టెక్నాలజీతో అద్భుతాలు సృష్టిస్తున్నది టీహబ్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఇమాజినేట్ స్టార్టప్. మన కలల్లోనే ఊహించుకునే ప్రపంచాన్ని కండ్ల ముందుకు తీసుకొస్తున్నదీ సంస్థ. దీన్ని హేమంత్ సత్యనారాయణ ప్రారంభించారు.
మధుమేహుల కోసం వినూత్న ఆవిష్కరణ – వివా లైఫ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్
మధుమేహం ఉంటే రోజూ ఉదయాన్నే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పరీక్షించుకోవాలి. ఇందుకోసం ప్రతి రోజు ఎంతో నొప్పిని భరిస్తూ షుగర్ పరీక్షలు చేసుకొంటూనే ఉంటారు. ఈ బాధను ప్రత్యక్షంగా చూసిన దువ్వూరు వర్షిత అనే హైదరాబాదీ యువతి నాన్ఇన్వేసివ్ గ్లూకోమీటర్ ‘ఈజీలైఫ్’ను రూపొందించింది. విమల్కుమార్తో కలిసి వివా లైఫ్ ఇన్నోవేషన్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేసింది. నగరంలో ఒక స్టార్టప్‌గా ప్రారంభమైన వివా లైఫ్ ఇన్నోవేషన్స్ దేశంలోనే తొలి నాన్ఇన్వేసివ్ గ్లూకో మీటర్‌ను రూపొందించిన స్టార్టప్‌గా నిలిచింది. ఈజీలైఫ్ ఖర్చు తక్కువ. సులభంగా ఉపయోగించొచ్చు. గ్లూకోమీటర్‌ను స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానం చేస్తే చికిత్స కోసం అవసరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఈ స్టార్టప్‌లో పలు కంపెనీలు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాయి.
ఆర్థిక సేవలకు అత్యాధునిక పరిజ్ఞానం – బ్లూకోపా స్టార్టప్
ఆర్థికంగా ఎక్కువ వృద్ధి రేటు ఉన్న కంపెనీలకు అవసరమయ్యేలా, ముఖ్యంగా చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్స్ (సీఎఫ్‌వో)కు, ఫైనాన్స్ రంగంలోని నిపుణులకు ఉపయోగపడేలా సరికొత్త అప్లికేషన్‌ను బ్లూకోపా స్టార్టప్ రూపొందించింది. ప్రస్తుతం టీ హబ్ కేంద్రంగా కార్యకలాపాలు మొదలుపెట్టిన స్టార్టప్‌కు పెట్టుబడిదారుల నుంచి మంచి అవకాశాలు వచ్చాయి. ఈ స్టార్టప్ రూపొందించే అప్లికేషన్‌కు అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్న అంచనాతో పెద్ద మొత్తంలో సీడ్ ఫండ్ ద్వారానే నిధులను వెచ్చించేందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపుతున్నారు. బ్లూకోపా స్టార్టప్‌ను రాఘవేంద్రరెడ్డి, సత్యప్రకాష్ బుద్ధవరపు, నీలోత్పల్ చందా ప్రారంభించారు. సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్ (సాస్) విభాగంలో సరికొత్త సేవలందించే బ్లూకోపాకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఉన్నది.
వ్యవసాయంలో డ్రోన్ విప్లవం – మారుత్ డ్రోన్స్ స్టార్టప్
వ్యవసాయ రంగంలో సాంకేతికతను సమర్థంగా అందించడంలో డ్రోన్స్ కీలకంగా మారాయి. డ్రోన్స్ తయారీ, క్షేత్రస్థాయిలో వినియోగించడంలో మారుత్ డ్రోన్స్ స్టార్టప్ విజయవంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. వ్యవసాయ అవసరాలకు డ్రోన్లను తయారు చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పరీక్షించామని వ్యవస్థాపకుడు ప్రేమ్ కుమార్ తెలిపారు. తాము తయారు చేసిన బహుళ వినియోగ వ్యవసాయ డ్రోన్ ఏజీ 365కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) నుంచి సర్టిఫికేషన్ లభించిందని వెల్లడించారు. ఒక్క రోజులో 25 నుంచి 30 ఎకరాలకు పిచికారీ చేయొచ్చు. ఎరువులు చల్లటం, గుళికలు వేయటం, పుష్ప సంపర్కం, పంట ఆరోగ్యంపైనా ఈ డ్రోన్ నిఘా పెట్టగలదు. ఇప్పటికే తెలంగాణలో హరాబరా పేరుతో డ్రోన్ల ద్వారా అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టారు. దాన్ని పరిశీలించిన కేంద్రం.. దేశంలోని ఇతర రాష్ర్టాల అటవీ ప్రాంతాల్లో సీడ్ బాల్స్‌ను డ్రోన్ల ద్వారా జల్లేందుకు అనుమతిచ్చింది.