హైదరాబాద్, ఆగస్టు 4(నమస్తే తెలంగాణ) : కేరళ రాష్ట్రంలోని వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు డిమాండ్ చేశారు. దీనిని కేవలం ఓ రాష్ట్ర సమస్యగా పరిగణించి వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని పేర్కొన్నారు. దక్షిణాదిలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరుగలేదని ఆయన ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విలయాన్ని కేంద్రం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా హెచ్చరికలను జారీచేసే వ్యవస్థను ఏర్పాటుచేయాలని కోరారు.