నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే వట్టెం పంప్‌హౌజ్ నీట మునిగిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత డాక్టర్ నాగం జనార్దన్‌రెడ్డి ఆరోపించారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర సమీపంలో నీట మునిగిన వట్టెం(వెంకటాద్రి)రిజర్వాయర్ పంప్‌హౌజ్‌ను సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా టన్నెల్లోకి వెళ్లి పంప్‌హౌజ్‌లో నీట మునిగిన మోటర్లను, అక్కడ జరుగుతున్న పనితీరును పరిశీలించారు.
ఈఈ పార్థసారథితో మాట్లాడారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పంప్‌హౌజ్ మునకకు వందశాతం ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు. నీళ్లతో పంప్‌హౌజ్ మునుగుతుందని ప్రజలు తెలిపినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. అసలు అధికారులకు బుద్ధి ఉందా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పనుల నిర్వహణలో బాధ్యతారాహిత్యానికి కారణమైన ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వీలైనంత త్వరగా టన్నెల్‌లోని నీటిని తోడి బురుదలో కూరుకుపోయిన మోటర్లను వెలికితీయాలని సూచించారు. లేకుంటే రూ.2,600 కోట్ల విలువైన మోటర్లకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఈ ప్రాజెక్టును గత కేసీఆర్ ప్రభుత్వం దాదాపుగా పూర్తిచేసిందని, దీన్ని ప్రారంభిస్తే తమకు పేరు రాదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యంత నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టు ఏదైనా ఉందంటే.. అది పాలమూరు ఎత్తిపోతల పథకమే అని పేర్కొన్నారు. పాలమూరు బిడ్డను అని చెప్పుకొనే సీఎం రేవంత్‌రెడ్డి దాదాపు పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలను బయటపెట్టాలన్నారు. రూ.2లక్షల రుణమాఫీ వందశాతం చేయాలని డిమాండ్ చేశారు.